విద్యార్థులంతా సంఘటితం కావాలి : కాంపాటి పృథ్వీ

విద్యార్థులంతా సంఘటితం కావాలి : కాంపాటి పృథ్వీ

కేయూ క్యాంపస్, వెలుగు:  ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం విద్యార్థులంతా సంఘటితంగా ఉద్యమించాలని పీడీఎస్ యూ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ పిలుపునిచ్చారు. కేయూ గెస్ట్ హౌజ్ లో ఆదివారం పీడీఎస్ యూ వర్సిటీ ప్రెసిడెంట్ బి.బాలకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన కేయూ 12వ మహాసభలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాయన్నారు. పాలకులు ప్రైవేట్, కార్పొరేట్ యాజమాన్యాల ప్రయోజనాలే లక్ష్యంగా విద్యారంగంలో సంస్కరణలు తీసుకొస్తున్నారని, పేద విద్యార్థులకు విద్యను దూరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్ర సర్కారు పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్​మెంట్​ విడుదల చేయకుండా పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసే కుట్రలకు పాల్పడుతున్నాడన్నారు.  ప్రభుత్వాలు విద్యారంగానికి సరిపడా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం 17 మందితో పీడీఎస్ యూ కాకతీయ యూనివర్సిటీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మహాసభలో పలు తీర్మానాలను ఆమోదించారు. కార్యక్రమంలో పీడీఎస్ యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహరావు, ఉమ్మడి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రవి, నాయకులు వి.కావ్య, బి.అజయ్, పి.అనూష, గణేశ్, వంశీ తదితరులు పాల్గొన్నారు.