గంజాయి అక్రమ రవాణా చేసినందుకు మరణశిక్ష వేసిన్రు

గంజాయి అక్రమ రవాణా చేసినందుకు మరణశిక్ష వేసిన్రు

గంజాయి అక్రమ రవాణాకు కుట్ర పన్నాడని భారత సంతతికి చెందిన ఓ వ్యక్తిని సింగపూర్​లో ఉరి తీశారు. స్థానిక మీడియా కథనం ప్రకారం.. సింగపూర్​లో నివసిస్తోన్న భారత సంతతికి చెందిన వ్యక్తి తంగరాజు సుప్పయ్య(46) 2017లో 1017.9 గ్రాముల గంజాయిని తరలిస్తున్నాడని కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయన దోషిగా తేలాడు. దీంతో 2018లో అక్కడి ప్రభుత్వం మరణశిక్ష విధించింది. ఈ నిర్ణయాన్ని పై కోర్టు కూడా సమర్థించింది. జెనీవాకు చెందిన గ్లోబల్​ కమీషన్​ ఆన్​ డ్రగ్​ పాలసీ సభ్యుడు బిలియనీర్​ రిచర్డ్​ తన బ్లాగ్​లో, తంగరాజును అరెస్టు చేస్తున్నప్పుడు డ్రగ్స్​ ఎక్కడా లేవని రాశారు. ఒక అమాయకుడిని చంపే అవకాశం ఉందని ఆయన చెప్పారు.  దోషి కుటుంబం క్షమాపణ కోసం విఙప్తి చేసింది. ఉరిశిక్షను అమలు నిర్ణయంపై పునరాలోచించాలని సింగపూర్​ ప్రభుత్వాన్ని కోరుతూ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయంతో సహా అంతర్జాతీయ సంస్థలు విఙప్తి చేశాయి. 

నేరం నిరూపితమైందన్నహోం మంత్రిత్వ శాఖ..


ఇదే సమయంలో తంగరాజు చేసిన నేరం నిరూపితమైందని ఏప్రిల్​ 25న సింగపూర్​ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. వారి వివరాల ప్రకారం.. అతనికి చెందిన రెండు ఫోన్ నంబర్లు మాదకద్రవ్యాల సరఫరాలో కీలకంగా మారాయని ప్రాసిక్యూటర్లు వెల్లడించారు.

కఠినమైన సింగపూర్​ చట్టాలు...

సింగపూర్‌లో ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రగ్స్​ వ్యతిరేక చట్టాలు ఉన్నాయి. యూఎన్​ మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం సింగపూర్ ప్రభుత్వ వాదనను ఖండించింది. మరణ శిక్ష అమలుతో నేరాలు అరికట్టవచ్చనే అపోహను వారు ఖండించారు. రెండు సంవత్సరాల తర్వాత అక్కడి ప్రభుత్వం మార్చి 2022న ఉరిశిక్షలు వేయడాన్ని మళ్లీ ప్రారంభించింది. సింగపూర్ పొరుగు దేశం, థాయ్‌లాండ్ డ్రగ్స్ స్మగ్లింగ్‌కు ఇప్పటికే ఉరిశిక్షను రద్దు చేసింది. థాయ్ లాండ్​ ప్రభుత్వాన్ని సింగపూర్​ కూడా అనుసరించాలని ఒత్తిడి పెరుగుతోంది.