ఏటీఎంలో క్యాష్ లేకుంటే బ్యాంకులపై పెనాల్టీ

ఏటీఎంలో క్యాష్ లేకుంటే బ్యాంకులపై పెనాల్టీ

అక్టోబర్​ 1 నుంచి ఆర్​బీఐ కొత్త రూల్
న్యూఢిల్లీ:  ఏటీఎంలలో క్యాష్​ లేకపోతే బ్యాంకులు, ఏటీఎం ఆపరేటర్లపై రూ. 10 వేల ఫైన్​ను రిజర్వ్​ బ్యాంక్ ఆఫ్​ ఇండియా (ఆర్​బీఐ) విధించనుంది. ఏటీఎంలలో క్యాష్​ ఎంతుందో ఎప్పటికప్పుడు మానిటర్​ చేసే విధంగా సిస్టమ్స్​ తేవాలని వాటికి సూచించింది. ఈ కొత్త రూల్​ను అక్టోబర్​ 1 నుంచి అమలులోకి తేనున్నారు.  ఒక నెలలో 10  గంటలకు మించి ఏటీఎంలలో క్యాష్​ లేకపోతే ఈ రూ. 10 వేల పెనాల్టీ విధిస్తారు. వైట్​ లేబుల్​ ఏటీఎం ఆపరేటర్ల విషయంలో పెనాల్టీని క్యాష్​ నింపే బాధ్యత తీసుకున్న  బ్యాంకులపైనే విధిస్తారు. ఆ తర్వాత ఈ పెనాల్టీని కావాలనుకుంటే బ్యాంకులు ఆ వైట్​లేబుల్​ ఏటీఎం ఆపరేటర్​ నుంచి వసూలు చేసుకోవచ్చు. ఏటీఎంలలో క్యాష్​ ఎంత టైము లేదనే విషయాన్ని ఆర్​బీఐకి బ్యాంకులు ఇకమీదట నెలవారీగా తెలియ చేయాల్సి ఉంటుంది. తర్వాత నెల మొదటి అయిదు రోజులలో ఈ రిపోర్టును ఆర్​బీఐకి తప్పనిసరిగా పంపించాలి. అంటే అక్టోబర్​ 1 నుంచి రూల్స్​ అమలులోకి వస్తాయి కాబట్టి, నవంబర్​ 5 లోపు పైన చెప్పిన విధంగా రిపోర్టును బ్యాంకులు ఆర్​బీఐకి ఇవ్వాలి. ఆర్​బీఐ రీజినల్​ ఆఫీసులలోని  ఇష్యూ డిపార్ట్​మెంట్​ ఇంఛార్జ్​కు ఈ పెనాల్టీ విధించే అధికారాన్ని ఇచ్చారు. పెనాల్టీ విధింపుపై అభ్యంతరాలుంటే బ్యాంకులు, వైట్​లేబుల్​ ఆపరేటర్లు ఆర్​బీఐ రీజినల్​ డైరెక్టర్లకు నెల రోజుల లోపు తెలియచేయొచ్చు.