ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ దేశం కవ్వింపులకు దిగినా.. దాడి చేసినా యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్నామని.. సైన్యాన్ని సిద్ధం చేశామని.. గ్రౌండ్ ఎటాక్ చేయటానికి.. అంటే భారత సైనికులు పాకిస్తాన్ దేశంలోకి వెళ్లి భూ దాడులు చేయటానికి సైతం సన్నద్ధం అయ్యి ఉన్నామని సంచలన ప్రకటన చేశారు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది.
ఆపరేషన్ సింధూర్ 88 గంటలు సాగిందని.. ఆ సమయంలో దేశం మొత్తం ఎంత అప్రమత్తం అయ్యిందో.. దేశ ప్రజలను ఎలా సన్నద్ధం చేశామో అందరూ చూశారంటూ అప్పట్లో జరిగిన యుద్ధ సన్నాహాలను గుర్తు చేశారు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది.
ఆపరేషన్ సింధూర్ కు కౌంటర్ గా పాకిస్తాన్ దేశం దాడులు చేస్తే ఎదుర్కోవటానికి భారత సైనికులు సిద్ధంగా ఉన్నారని.. నేవీ, వాయు సేనలే కాకుండా.. భూ భాగంపైనా యుద్ధం చేయటానికి అంతా రెడీ అయ్యామని వెల్లడించారాయన. 2026, జనవరి 13వ తేదీన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సంచలన విషయాలు బయటపెట్టారు.
పాకిస్తాన్ పదే పదే డ్రోన్లను ప్రయోగిస్తూ.. ఇండియా సహనాన్ని పరీక్షిస్తుందని.. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చిన ఆర్మీ చీఫ్.. పాకిస్తాన్ ను ఎదుర్కోవటానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటామన్నారాయన. ఆపరేషన్ సింధూర్ ఇప్పటికీ కొనసాగుతుందని.. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ఏదైనా దుశ్సాహసానికి దిగితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు భారత్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది
