రేషన్​ కార్డు ఈ– కేవైసీ కోసం జనం తీవ్ర ఇబ్బందులు

రేషన్​ కార్డు ఈ– కేవైసీ కోసం జనం తీవ్ర ఇబ్బందులు
  • రేషన్​షాపుల దగ్గర గంటల తరబడి పడిగాపులు
  • అప్​డేటెడ్ ​ఆధార్ ​లేని వారికి మరిన్ని ఇబ్బందులు
  • అప్​డేషన్​​ కోసం నియోజకవర్గ కేంద్రాలకు పరు

మెదక్/కౌడిపల్లి, వెలుగు: రేషన్​ కార్డు ఈ– కేవైసీ కోసం జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్డులోని ఒక్కరు చేయించుకోకపోయినా బియ్యం రావని డీలర్లు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డు పొందాలన్నా ఈ– కేవైసీ కంపల్సరీ అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. తెల్లవారుజాము నుంచే కుటుంబ సభ్యులతో కలిసి రేషన్​ షాపుల వద్ద క్యూ కడుతున్నారు. ఏ గ్రామంలో చూసినా రేషన్​షాపుల వద్ద గుంపులుగుంపులుగా జనం కనిపిస్తున్నారు. ఒక్కొక్కరి వివరాలు సరిచూసి, ఈ– కేవైసీ ప్రాసెస్​చేసేందుకు టైమ్​పడుతోంది. పలు రేషన్​షాపుల్లోని బయో మెట్రిక్ మిషన్లలో వృద్ధులు, చిన్న పిల్లల వేలి ముద్రలు నమోదు కావడం లేదు. అలాంటి వారు ఆధార్​సెంటర్​కు వెళ్లి ఫోన్​నంబర్​తో సహా ఆధార్​అప్​డేట్​చేసుకోవాలని, తర్వాత రేషన్​ షాపుకు వస్తే ఈ–కేవైసీ ప్రాసెస్ అవుతుందని డీలర్లు చెబుతున్నారు. అయితే రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో  ఆధార్ సెంటర్లు లేవు. కుటుంబ సభ్యులంతా కలిసి 20 నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉండే టౌన్​లు, నియోజకవర్గ కేంద్రాలకు వెళ్లాల్సి వస్తోంది. ఉదాహరణకు మెదక్​​ జిల్లాలోని కౌడిపల్లి, కొల్చారం మండలాల్లో ఎక్కడా ఆధార్​నమోదు సెంటర్లు లేవు. అప్ డేట్​చేసుకోవాలంటే నర్సాపూర్​లేదా మెదక్ వెళ్లాల్సి వస్తోంది. అయితే అక్కడి సెంటర్లలో విపరీతమైన రద్దీ ఉంటోంది. ఆధార్​అప్​డేషన్​కోసం రెండు, మూడు రోజులు తిరగాల్సి వస్తోందని జనం వాపోతున్నారు. కొన్ని సెంటర్లలో టోకెన్లు ఇచ్చి రెండు, మూడు రోజుల తర్వాత రావాలని చెబుతున్నట్లు సమాచారం.  

పనులన్నీ మానుకొని ప్రదక్షిణలు

రేషన్ కార్డులో ఎంత మంది పేర్లు ఉంటే.. అంత మంది కచ్చితంగా రేషన్ షాపుకు వెళ్లి వేలిముద్ర లేదా ఐరిష్​ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు, బతుకు దెరువు, చదువుల కోసం ఇతర ప్రాంతాల్లో ఉంటున్నవారు ఈ–కేవైసీ చేసుకోవడం ఇబ్బందికరంగా మారింది. ఏ రేషన్​షాపుకైనా వెళ్లి ఫుడ్​సెక్యురిటీ కార్డు నంబర్​ చూపించి ఈ–కేవైసీ చేసుకునే అవకాశం ఉంది. కానీ చదువుల కోసం అనేక మంది స్టూడెంట్లు ఇతర ప్రాంతాల్లోని హాస్టళ్లలో ఉంటున్నారు. అలాంటి వారు గ్రామాలకు వచ్చి ప్రాసెస్​చేయించుకుంటున్నారు. అలాగే గ్రామాల్లోని ప్రజలు పనులన్నీ మానుకొని రేషన్​షాపులు, ఆధార్​నమోదు కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు.

అప్​డేటెడ్​ ఆధార్​ అడుగుతున్నరు

ఈ–కేవైసీ చేయించుకునేటందుకు రేషన్​షాపుకు పోతే ఆధార్, ఫోన్​ నంబర్​లింక్​ అయి ఉండాలంటున్నరు. ఆధార్ అప్​డేట్ చేసుకుందామంటే కౌడిపల్లి మండలంలో ఆధార్ సెంటర్ లేదు. నేనొక్కడినే కాదు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఆధార్​కు ఫోన్ నంబర్​లింక్​చేయాలంటే నర్సాపూర్​ లేదా మెదక్​ పోవాల్సి వస్తోంది.

- మహమ్మద్ దస్తగిరి, కుకుట్లపల్లి, మెదక్ జిల్లా

బియ్యం ఇయ్యకుంటే ఏం తినాలె

నాకు కొన్నేండ్ల సంది పానం బాగలేదు. నడువలేక పోతున్నా. ఇప్పుడేమో రేషన్ షాప్ కు వెళ్లి వేలి ముద్ర వేయాలని చెబుతున్రు. నేను అక్కడి దాక నడవలేను. నా లెక్క చాలామంది ఉన్నరు. వేలి ముద్ర వేయకుంటే రేషన్ బియ్యం రావంటున్నరు. బియ్యం ఇయ్యకుంటే మా అసుంటోళ్లు ఏం తినాలె. కడుపునిండుడు ఎట్ల.

- గాండ్ల మాణెమ్మ, రాజిపేట్, మెదక్ జిల్లా