- రేట్లు పెరుగుతాయని సోషల్ మీడియాలో ప్రచారం..
- పలుచోట్ల నో స్టాక్ బోర్డులు
హైదరాబాద్ సిటీ/ఖమ్మం/ భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: హైదరాబాద్ నగరంతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. కొన్ని బంక్‌ల్లో ఇప్పటికే స్టాక్ అయిపోవడంతో వాటిని మూసివేశారు. స్టాక్ ఉన్న బంకుల వద్ద వాహనదారులు బారులుదీరారు. స్టాక్ తక్కువగా ఉండడం, వాహనదారులు భారీ సంఖ్యలో వస్తుండడంతో బంక్ యజమానులు కండీషన్లు పెడుతున్నారు.
ఖమ్మం జిల్లాలోని కొన్ని బంక్‌ల యజమానులు కారుకు రూ.1500, బైక్‌కు రూ.500 పెట్రోల్ మాత్రమే పోస్తామని చెబుతుండగా, మరికొందరు కార్లకు ఐదు లీటర్లు, బైక్‌లకు 2 లీటర్లే పోస్తున్నారు. పాల్వంచలోని కేఎస్‌ఎం బంకులో డీజిల్ కోసం 108 అంబులెన్స్‌లు పడిగాపులు పడాల్సి వచ్చింది. శనివారం రాత్రి అంబులెన్స్ బంకు వద్దకు రాగా కొంత డీజిల్ పోసి ఆదివారం ఉదయం రమ్మని చెప్పారు. ఆదివారం వెళ్తే ఆర్డీఓ, తహసీల్దార్ నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలంటూ చెప్పడంతో సుమారు గంటకుపైగా అంబులెన్స్‌లు నిలిచిపోయాయి.
చివరకు అడిషనల్ కలెక్టర్, సివిల్ సప్లై ఆఫీసర్ల నుంచి వచ్చిన ఆదేశాలతో అంబులెన్స్‌లకు డీజిల్ పోశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10, మణికొండ, షేక్‌పేటలోని బంకులను మూతపడగా.. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12, బల్కంపేట, బేగంపేట, శేరిలింగంపల్లి, గచ్చిబౌలిలోని బంకుల వద్ద క్యూ లైన్లు పెరిగిపోయాయి.
సోషల్ మీడియా ప్రచారంతో...
పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడులో ఎన్నికలు ముగియగానే పెట్రోల్, డీజిల్ రేట్లు భారీ స్థాయిలో పెరుగుతాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనికి తోటు ఇంధన సరఫరాలో అంతరాయం, నో క్రెడిట్ విధానం కారణంగా ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్‌ను సప్లై చేయడం లేదని ప్రచారం జరుగుతోంది. దీంతో పెట్రోల్, డీజిల్ దొరకదన్న భయంతో వాహనదారులు ఫుల్ ట్యాంక్ చేయించుకోవడంతో పాటు, క్యాన్లు, డ్రమ్ముల్లో తీసుకెళ్తున్నారు.
దీంతో స్టాక్ త్వరగా అయిపోతుందని తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బంక్‌ల వద్ద వాహనాదారులు భారీ సంఖ్యలో తరలిరావడంతో పోలీస్ బందోబస్త్ నడుమ పెట్రోల్ పోస్తున్నారు. ఇదిలా ఉండగా... పెట్రోల్, డీజిల్‌ను సోమవారం నుంచి నిరంతరం సరఫరా చేస్తామని కంపెనీలు హామీ ఇచ్చాయని పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఈశ్వరప్రగడ రంగనాథ్, ప్రధాన కార్యదర్శి కూరపాటి మంజుల ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం వరకు అన్ని బంకుల్లో ఇంధన నిల్వలు ఉంటాయని పేర్కొన్నారు. అలాగే పెట్రోల్, డీజిల్ కొరతపై ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
- పలు చోట్ల నో స్టాక్ బోర్డులు
హైదరాబాద్, వెలుగు : ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరతతో బంకులు మూతపడుతున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 4,510 బంక్‌ల ద్వారా సాధారణ రోజుల్లో రోజుకు 6,330 కిలోలీటర్ల పెట్రోల్, 9,048 కిలోలీటర్ల డీజిల్ అమ్మకాలు జరిగేవి. పెట్రోల్, డీజిల్ కొరత ఉందని, రేట్లు పెరుగుతాయని ప్రచారం జరుగుతుండడంతో కొనుగోళ్లు భారీగా పెరిగాయి. శనివారం 8,489 కిలోలీటర్ల పెట్రోల్, ఆదివారం 7,750 కిలోలీటర్ల పెట్రోల్ అమ్మకాలు జరిగాయి.
మరోవైపు డీజిల్ శనివారం 10,556 కిలో లీటర్లు, ఆదివారం 9,392 కిలోలీటర్ల అమ్మకాలు జరిగాయి. సాధారణం కంటే ఎక్కువగా అమ్మకాలు జరుగుతుండడంతో బంకుల్లో నిల్వలు అయిపోతున్నాయని ఆఫీసర్లు వివరించారు. ఏపీలో పెట్రోల్ బంక్‌ల మూసివేతపై సీఎం చంద్రబాబు ఆదివారం సమీక్ష నిర్వహించారు. పెట్రోల్, డీజిల్.. డిమాండ్‌కు తగ్గట్లు సప్లై ఉండేలా చూడాలని ఆఫీసర్లు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులను ఆదేశించారు. కంపెనీలు, రిటైల్ ఔట్‌లెట్ల మధ్య గ్యాప్ లేకుండా చూసుకోవాలన్నారు.
ప్రజలను, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే.. అనుమతుల విషయం పునరాలోచన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు రెవెన్యూ, పోలీస్, లీగల్ మెట్రాలజీ విభాగాలతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్, కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. వరికోత యంత్రాలకు డీజిల్ కొరత రానివ్వొద్దన్నారు. రైతులకు కూపన్ విధానం ప్రవేశపెట్టే ఆలోచన చేయాలని సూచించారు. సోమవారం నాటికి ఎక్కడా నో స్టాక్ బోర్డులు కనిపించకూడదని చెప్పారు.

