- దీపావళి నజరానా ప్రకటించిన కోల్ ఇండియా యాజమాన్యం
- గతేడాది కంటే రూ.7,250 హైక్ జేబీసీసీఐ అపెక్స్ కమిటీ మీటింగ్‌లో నిర్ణయం
- దేశవ్యాప్తంగా 2.37 లక్షల మంది ఉద్యోగులకు చెల్లింపు
కోల్‌బెల్ట్, వెలుగు: దేశవ్యాప్తంగా బొగ్గు గని కార్మికులకు దీపావళి సందర్భంగా చెల్లించే పీఎల్‌ఆర్(పర్ఫామెన్స్ లింక్డ్ రివార్డ్ బోనస్)ను కోల్ ఇండియా యాజమాన్యం శనివారం రాత్రి ప్రకటించింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో కార్మికుడికి రూ.1,10,250 చెల్లించనున్నట్లు వెల్లడించింది. గతేడాది రూ.1,03,000 చెల్లించగా.. ఈసారి రూ.7,250 పెంచింది. కోల్ ఇండియాలోని సుమారు 1.97 లక్షల మంది, సింగరేణిలో మార్చి 2026 నాటికి ఉన్న 40,300 మంది నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులకు ఈ బోనస్ ప్రయోజనం వర్తించనుంది.
రూ.1.20 లక్షల వరకు డిమాండ్..
పీఎల్‌ఆర్ బోనస్‌పై చర్చించేందుకు కోల్‌కతాలోని కోల్ ఇండియా లిమిటెడ్ ప్రధాన కార్యాలయంలో జేబీసీసీఐ అపెక్స్ కమిటీ సమావేశం శనివారం జరిగింది. కోల్ ఇండియా లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బి.సాయిరాం అధ్యక్షతన ఉదయం 11.30 గంటలకు కార్మిక సంఘాలైన బీఎంఎస్, హెచ్‌ఎంఎస్, ఏఐటీయూసీ, సీఐటీయూ ప్రతినిధులతో చర్చలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం భోజన విరామం తర్వాత సాయంత్రం 3 గంటలకు పీఎల్‌ఆర్ బోనస్‌పై చర్చ జరిగింది. యూనియన్ ప్రతినిధులు రూ.లక్షా 15 వేల నుంచి రూ.లక్షా 20 వేల వరకు చెల్లించాలని డిమాండ్ చేశారు. కోల్ ఇండియా యాజమాన్యం రూ.లక్షా 8 వేల నుంచి రూ.లక్షా 9 వేల 500 వరకు చెల్లించేందుకు ప్రతిపాదించింది. చివరకు రూ.లక్షా 10 వేల 250 చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించగా.. కార్మిక సంఘాల ప్రతినిధులు కూడా ఓకే చెప్పారు.
సింగరేణి కార్మికులకూ వర్తింపు..
సింగరేణిలో మార్చి 2026 నాటికి ఉన్న 40,300 మంది నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులకు పీఎల్‌ఆర్ బోనస్ ప్రయోజనం లభించనుంది. నిర్దేశిత నిబంధనల ప్రకారం అర్హత ఉన్న రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఈ ప్రయోజనం వర్తిస్తుంది. 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 మధ్య ఉద్యోగ విరమణ చేసిన సుమారు 8,351 మంది కోల్ ఇండియా ఉద్యోగులకు కూడా పీఎల్‌ఆర్ బోనస్ లభించే అవకాశం ఉంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో కనీసం 30 పనిదినాలు పనిచేసిన ఉద్యోగులకు
ఈ బోనస్ వర్తిస్తుంది.
లాభాల వాటా కంటే ముందే..
సింగరేణిలో లాభాల వాటాను ప్రకటించడానికి ముందే పీఎల్‌ఆర్ బోనస్ ప్రకటించడం ఇదే తొలిసారి. యాజమాన్యం తీరుపై కార్మికులు, కార్మిక సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేయగా, మరోవైపు రూ.1,10,250 పీఎల్‌ఆర్ బోనస్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది కార్మికుల విజయమని ఏఐటీయూసీ, సీఐటీయూ, బీఎంఎస్, హెచ్‌ఎంఎస్ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, మందా నర్సింహారావు, యాదగిరి సత్తయ్య, రియాజ్ అహ్మద్ పేర్కొన్నారు. చర్చల్లో యూనియన్ల నుంచి కె.లక్ష్మారెడ్డి (బీఎంఎస్), హర్భజన్ సింగ్ సిద్ధూ(హెచ్‌ఎంఎస్), డి.డి.రామానందన్ (సీఐటీయూ), లఖన్‌లాల్ మహతో(ఏఐటీయూసీ), యాజమాన్యం తరఫున మార్కెటింగ్ డైరెక్టర్, ఇన్‌చార్జి డైరెక్టర్(హెచ్ఆర్) ముకేశ్ చౌధరి, డైరెక్టర్ (ఫైనాన్స్) ముకేశ్ అగర్వాల్, జీఎం దుర్గా ప్రసాద్ సమల్, సింగరేణి డైరెక్టర్(పా) గౌతం పోట్రు పాల్గొన్నారు.
7 శాతం పెంపు..
సింగరేణి కార్మికులు ప్రతి ఏటా దీపావళికి ముందు అందుకునే పీఎల్‌ఆర్ బోనస్ ఈసారి రూ.1,10,250 కాగా, గతేడాది రూ.1,03,000 చెల్లించారు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.76,500, 2022–23లో రూ.85,000, 2023–24లో రూ.93,750, 2024–25లో రూ.1,03,000 బోనస్‌గా అందుకున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 7 శాతం పెరిగింది. కోల్ ఇండియా ఉద్యోగులకు పీఎల్‌ఆర్ బోనస్‌ను దసరా పండుగకు ముందు చెల్లించడం ఆనవాయితీగా వస్తోంది. అక్టోబర్ 15లోపు చెల్లించే అవకాశం ఉంది. సింగరేణి యాజమాన్యం దీపావళికి ముందు చెల్లించనుంది.
