నిలిచిన కర్నాటక నీళ్లు!..తెలంగాణకు నీళ్లియ్యొద్దంటూ కన్నడ రైతుల ఆందోళన

నిలిచిన కర్నాటక నీళ్లు!..తెలంగాణకు నీళ్లియ్యొద్దంటూ కన్నడ రైతుల ఆందోళన
  • సాగుకు ఒక్క చుక్క కూడా ఇవ్వొద్దు.. తాగునీటికైతే ఒక్క టీఎంసీ ఇవ్వాలని డిమాండ్
  • గత నెల కర్నాటక సీఎం డీకే శివకుమార్​తో మన మంత్రుల భేటీ    
  • టీఎంసీలు ఇచ్చేందుకు ఒప్పుకున్న కర్నాటక సర్కార్.. ఇప్పుడు వెనక్కి

హైదరాబాద్, వెలుగు: జూరాల ప్రాజెక్టుకు కర్నాటక నుంచి రావాల్సిన నీళ్లు ఆగిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా చివరి దశలో ఉన్న పంటలను కాపాడేందుకుగానూ.. కర్నాటక ప్రభుత్వంతో మన ప్రభుత్వం తరఫున మంత్రులు జూపల్లి కృష్ణా రావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు మధుసూదన్​ రెడ్డి, మేఘారెడ్డిలు గత నెల 22, 23వ తేదీల్లో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. కరువు పరిస్థితుల దృష్ట్యా వారబందీ పద్ధతిలో 3 టీఎంసీల నీటిని ఆల్మట్టి నుంచి విడుదల చేసేందుకు కర్నాటక సీఎం డీకే శివకుమార్​ అంగీకరించారు.

అయితే, తాజాగా నీటి విడుదలపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఎల్​నినో పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణకు నీళ్లు ఇవ్వొద్దని కర్నాటక రైతులు, రైతు సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. తమ అవసరాలను కాదని.. తెలంగాణకు నీళ్లిస్తామంటే ఊరుకునేది లేదని కర్నాటక రైతులు తేల్చి చెబుతున్నారు. కరువు పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తెలంగాణకు ఒక్క టీఎంసీ తాగునీళ్లు ఇచ్చేందుకు ఓకేగానీ.. సాగు అవసరాలకు నీళ్లిస్తామంటే ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. దీంతో  సీఎం డీకే శివకుమార్​.. తెలంగాణకు నీళ్లు ఇస్తానన్న తన నిర్ణయాన్ని తాత్కాలికంగా వెనక్కి తీసుకున్నట్టుగా తెలుస్తున్నది.

మన రైతుల ఆందోళనలు..

కర్నాటక ప్రభుత్వంతో రాష్ట్ర సర్కారు చర్చలు జరపడానికి ముందు పాలమూరు జిల్లా రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు ఆందోళనలు చేపట్టారు. జూరాల ప్రాజెక్టుపైకి వెళ్లి కాలువ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసుకున్నారు. పంటలు ఎండిపోతుండడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో రైతులు కాల్వ గేట్లు ఎత్తారు. ఈనేపథ్యంలోనే డీకేతో చర్చలు జరిపేందుకు మంత్రులు జూపల్లి కృష్ణా రావు, వాకిటి శ్రీహరిల బృందాన్ని సీఎం రేవంత్​ కర్నాటకకు పంపించారు.

సెప్టెంబర్​ 22, 23వ తేదీల్లో డీకే శివకుమార్​ను కలిసి మంత్రులు జిల్లాలోని పరిస్థితులు వివరించారు. దీంతో ఆయన మూడు టీఎంసీలు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. కానీ, అక్కడి రైతులు కూడా ఆందోళనలు చేపడుతుండడంతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిన 
పరిస్థితులు ఏర్పడ్డాయి. 

జూరాలలో ఉన్నది ఇంకో 5 టీఎంసీలే..

జూరాల ప్రాజెక్టులో నీటి నిల్వలు పడిపోతున్నాయి. ప్రస్తుతం ఆ ప్రాజెక్టులో 8.53 టీఎంసీల మేర నీళ్లుండగా.. అందులో వాడుకునేందుకు వీలుగా 4 .82 టీఎంసీలే అందుబాటులో ఉన్నాయి. ఇటు శ్రీశైలం ప్రాజెక్టులోనూ నిల్వలు వేగంగా పడిపోతున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 82 టీఎంసీలకు పడిపోయింది. ప్రాజెక్ట్​ డెడ్​స్టోరేజ్​53.85 టీఎంసీలు. అంటే వాడుకోవడానికి మరో 29 టీఎంసీలే ఉన్నాయి. సాగర్​లో 183 టీఎంసీలుండగా.. వినియోగానికి 52 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. ఈ నీటిని వచ్చే వానా కాలం సీజన్​ వరకు పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి.