- పరిహారం, ఆర్ అండ్ ఆర్ సమస్యలు వెంటనే తేల్చండి
- అధికారులకు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశం
హైదరాబాద్, వెలుగు: గౌరవెల్లి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి 1.06 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించేందుకు అవసరమైన అన్ని చర్యలను వేగవంతం చేయాలని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు, భూసేకరణ, సహాయ పునరావాస సమస్యలను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. శనివారం ఆయన సెక్రటేరియట్లో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులతో గౌరవెల్లి ప్రాజెక్టు పురోగతిపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.
ప్రాజెక్టుపై ఇప్పటికే భారీగా పెట్టుబడి పెట్టామని, ఆ ఫలాలు రైతులకు దక్కేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. స్పష్టమైన వర్క్ షెడ్యూల్ సిద్ధం చేసుకోవాలని, అర్హులైన నిర్వాసితుల పరిహార క్లెయిమ్‌లను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో తగినన్ని నిధులు అందుబాటులో ఉన్నాయని, పనుల్లో వేగం పెంచాలని స్పష్టం చేశారు.
సీఎస్‌కు రివైజ్డ్ ఎస్టిమేట్స్ పంపండి
ప్రాజెక్టుపై ఇప్పటివరకు మొత్తం రూ. 1,343.59 కోట్లు ఖర్చు చేశామని, ఇంకా రూ. 114.389 కోట్లు అవసరమవుతాయన్నారు. పెరిగిన భూ పరిహారం, సహాయ పునరావాస వ్యయం, జీఎస్టీ, ధరల సర్దుబాటు తదితర కారణాలతో సవరించిన రిజర్వాయర్ నిర్మాణ అంచనా వ్యయం రూ. 1,457.979 కోట్లకు చేరిందని, ఈ రివైజ్డ్ఎస్టిమేట్స్ను తర్వాతి కేబినెట్ సమావేశంలో చర్చించేలా అంచనాలను సీఎస్‌కు పంపాలని ఆదేశించారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సరైన అనుమతులు లేకుండా రిజర్వాయర్ సామర్థ్యాన్ని విస్తరించడంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ).. ప్రాజెక్టు పనులపై స్టే విధించిందని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు జూలై 29న ఇచ్చిన తీర్పు, కేంద్ర పర్యావరణ శాఖ సెప్టెంబర్ 30 నాటి మెమోరాండం ఆధారంగా అనుమతుల ప్రక్రియపై ముందుకు వెళ్లాలన్నారు. అక్టోబర్ 8న జరగనున్న అప్రైజల్ మీటింగ్‌కు అవసరమైన డాక్యుమెంటేషన్‌ను పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. అలాగే అడ్వకేట్ జనరల్, ప్రాజెక్టు న్యాయవాదులతో సమన్వయం చేసుకొని అక్టోబర్ 16న జరిగే ఎన్‌జీటీ విచారణకు తాజా పరిణామాలను సమర్పించాలని సూచించారు.
కాల్వలు సిద్ధం కావాలి
రిజర్వాయర్‌కు అవసరమైన 3,870 ఎకరాలకు గానూ ఇప్పటికే 3,850 ఎకరాలు సేకరించారని, మిగిలిన 20 ఎకరాలకు సంబంధించిన పరిహారాన్ని హైదరాబాద్‌లోని ల్యాండ్ అక్విజిషన్, ఆర్ అండ్ ఆర్ అథారిటీ వద్ద డిపాజిట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. కాల్వల భూసేకరణకు జిల్లా వారీగా టైమ్‌లైన్స్ నిర్దేశించుకోవాలని, నిర్వాసితుల అర్హత గల క్లెయిమ్‌లను నిబంధనల ప్రకారం వెంటనే పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
రిజర్వాయర్ నీటిని పొలాలకు తీసుకెళ్లేందుకు కుడి, ఎడమ ప్రధాన కాల్వల మరమ్మతులు, డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్ పనులను వేగవంతం చేయాలన్నారు. రాబోయే సాగునీటి సీజన్ నాటికి ఈ నెట్‌వర్క్ సిద్ధం కావాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షలో ఇరిగేషన్ శాఖ కార్యదర్శి ఇ. శ్రీధర్, ఈఎన్సీ జనరల్ రమేశ్ బాబు, ఈఎన్సీ ఓ అండ్ ఎం మధుసూదన్ రావు, జాయింట్ సెక్రటరీ కె. శ్రీనివాస్, భూసేకరణ–ఆర్ అండ్ ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు, సిద్దిపేట కలెక్టర్ కె. హైమావతి తదితరులు పాల్గొన్నారు.
