- ఇండస్ట్రీ కమిటీలో ధర్మపురి అర్వింద్, మల్లు రవి, సామాజిక న్యాయ కమిటీలో గోడెం
న్యూఢిల్లీ, వెలుగు: సెప్టెంబర్ 26 నుంచి అమలులోకి వచ్చేలా మొత్తం 24 పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలను స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. ఈ మేరకు శనివారం లోక్ సభ, రాజ్య సభ సెక్రటరీలు బులిటెన్ ను రిలీజ్ చేశాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల కమిటీలో ఎంపీ గడ్డం వంశీకృష్ణకు చోటు దక్కింది. ఈ కమిటీలో లోక్ సభ నుంచి 21 మంది సభ్యులుగా ఉండగా... రాజ్య సభ నుంచి 10 మందికి అవకాశం కల్పించారు.
ఈ కమిటీకి బీజేపీకి చెందిన మేధా విశ్రామ్ కులకర్ణి చైర్మన్ గా వ్యవహరించనున్నారు. అలాగే ఇండస్ట్రీ కమిటీలో ధర్మపురి అర్వింద్, మల్లు రవి, సామాజిక న్యాయ కమిటీలో గోడెం లకు చోటు దక్కింది. హౌసింగ్, పట్టణ వ్యవహారాల కమిటీలో చామల, రైల్వే, విదేశాంగ రెండు కమిటీల్లో డాక్టర్ కె లక్ష్మణ్ కు అవకాశం దక్కింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిటీలో కడియం కావ్య, కమ్యూనికేషన్లు, సమాచార సాంకేతికత కమిటీలో రామసహాయం రఘురామ్‌రెడ్డి, పెట్రోలియం, సహజ వాయువు కమిటీలో రవిచంద్ర వద్దిరాజు, రసాయనాలు, ఎరువుల కమిటీలో బలంనాయక్ ఉన్నారు.
విదేశాంగ కమిటీలో బీజేపి ఎంపీ డీకే అరుణ ను స్పీకర్ నియమించారు. ఇక రక్షణ కమిటీలో రక్షణ కమిటీలో దామోదర్ దివికొండ, బొగ్గు, గనులు కమిటీలో అనిల్ కుమార్ యాదవ్ కు రాజ్య సభ నుంచి చోటు దక్కింది.
