సల్మాన్ ఖాన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘మాతృభూమి’. షూటింగ్ పూర్తయి నెలలు గడుస్తున్నా రిలీజ్ ఆలస్యమవుతూ వస్తోంది. ఇందుకు కారణం.. భారత్–చైనా సరిహద్దులోని గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో దర్శకుడు అపూర్వ లఖియా ఈ చిత్రాన్ని రూపొందించడమే.
తాజాగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ రావడంతో సినిమా రిలీజ్‌కు లైన్ క్లియర్ అయినట్టు కనిపిస్తోంది. తొలుత ఈ చిత్రాన్ని ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ అనే టైటిల్‌తో స్టార్ట్ చేయగా, ఆ తర్వాత ‘మాతృభూమి’గా మార్చారు. అంతేకాదు భారత రక్షణ మంత్రిత్వ శాఖ చేసిన సూచనల మేరకు సినిమాలో చాలానే మార్పులు జరిగినట్టు తెలుస్తోంది.
కథా నేపథ్యాన్ని మార్చడంతో పాటు కొన్ని కల్పిత అంశాలను జోడించారట. అందుకు తగ్గట్టుగా దాదాపు నలభై శాతం రీషూట్ చేయగా ఈ మార్పులకు సంతృప్తి పడిన కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఓసీ ఇచ్చినట్టు సమాచారం. అయితే ఇంకా సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్స్ రావాల్సి ఉంది. అన్ని కార్యక్రమాలు ముగించుకుని నవంబర్ 13న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
