- అక్రమ నిర్మాణాలకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వకుండా చూస్తాం
- అంజయ్య నగర్ ఘటన తర్వాత 398 అక్రమ నిర్మాణాలు కూల్చివేశాం
- హాస్టల్స్ కోసం ప్రత్యేక పాలసీ తీసుకొస్తం
- రాంకీ ద్వారా 3,500 స్వచ్ఛ ఆటోలు కొనుగోలు చేస్తాం
- ప్రాపర్టీ టాక్స్ లోనే చెత్త పన్ను వసూలు
- వచ్చే నెల 2 నుంచి మరోసారి వన్ డే ఎవ్రీ వార్డు
- చిట్ చాట్ లో సీఎంసీ కమిషనర్ సృజన
హైదరాబాద్ సిటీ, వెలుగు: సీఎంసీలో అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని సీఎంసీ కమిషనర్ సృజన స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి ఒత్తిళ్లు, బెదిరింపులు వచ్చినా వెనక్కి తగ్గబోమని తేల్చిచెప్పారు. శనివారం సీఎంసీ హెడ్ ఆఫీస్‌లో నిర్వహించిన చిట్‌చాట్ లో పలు కీలక అంశాలపై మాట్లాడారు. ఈ ఏడాది ఆగస్ట్ 22న అంజయ్య నగర్ లో 50 గజాల్లో అక్రమంగా నిర్మించి 7 అంతస్థుల భవనం కూలిన ఘటన అనంతరం ఇప్పటివరకు 398 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు వెల్లడించారు. అనుమతులు లేకుండా లేదా నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న నిర్మాణాలను గుర్తించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అక్రమ భవన నిర్మాణాలకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వకుండా చూస్తామన్నారు.
వరదనీటి సమస్యకు మాస్టర్ ప్లాన్
వర్షాకాలంలో నగరంలో ఎదురవుతున్న వరదనీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నట్లు కమిషనర్ తెలిపారు. ఇందుకు సంబంధించి త్వరలో డీపీఆర్ ఫైనల్ చేస్తామన్నారు. అవసరమైన పనులను దశలవారీగా చేపడుతామని, ఇందుకోసం రూ.4 వేల నుంచి రూ.5 వేల కోట్ల వరకు అప్పులు తీసుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. భూగర్భ జలాలు పెంచేందుకు కోయంబత్తూరులో అమలు చేస్తున్న స్పాంజ్ విధానాన్ని ఇక్కడా అమలు చేయాలని నిర్ణయించామన్నారు.
ఆస్తి పన్నుతోనే చెత్త పన్ను
చెత్త పన్నును ఆస్తి పన్నులోనే కలిపి వసూలు చేసే విధానం అమలు చేయనున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. పారిశుధ్య వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు త్వరలో ఎలక్ట్రిక్ ఆటోలను రంగంలోకి దిం చనున్నట్లు చెప్పారు. రాంకీ సంస్థ ద్వారా సుమారు 3,500 స్వచ్ఛ ఆటోలను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు. స్లమ్ ఏరియాలు, ఇతర ప్రాంతాలను చూసి వేర్వేరు విధానంలో చెత్త పన్ను అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. కొత్త ఆటోలను ఇదివరకు పనిచేస్తున్న ఆటో కార్మికులు నడిపేందుకు సిద్ధంగా ఉంటే వారికి అందిస్తామని, లేదంటే ఇతరులకు ఇస్తామన్నారు. త్వరలో 4 డస్ట్ బిన్స్ విధానం అమల్లోకి వస్తుందన్నారు. బిన్స్ ఎవరిస్తారనే దానిపై ఇంకా క్లారిటీ లేదన్నారు.
హాస్టళ్ల నిర్మాణాలపైనే ఎక్కువ దృష్టి
నగరంలో ఇటీవల కాలంలో పెరుగుతున్న అక్రమ నిర్మాణాల్లో ఎక్కువ భాగం హాస్టళ్ల కోసం జరుగుతున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈ నేపథ్యంలో హాస్టళ్ల నిర్మాణం, నిర్వహణకు ప్రత్యేక పాలసీ తీసుకొస్తామని చెప్పారు. హాస్టళ్ల పేరుతో నివాస భవనాలను వాణిజ్య అవసరాలకు వినియోగించడం, నిబంధనలకు విరుద్ధంగా అదనపు నిర్మాణాలు చేపట్టడం వంటి అంశాలపైనా దృష్టి సారించనున్నట్లు తెలిపారు.
ప్రతీ వార్డుపై స్పెషల్ ఫోకస్
సీఎంసీ పరిధిలో 76 వార్డులు ఉండగా.. ప్రతీ వార్డులో సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు చేపట్టిన వన్ డే ఎవ్రీ వార్డు కార్యక్రమాన్ని ఒక రౌండ్ పూర్తి చేసినట్లు కమిషనర్ తెలిపారు. ఇందులో 1,899 సమస్యలను గుర్తించామని, ప్రాధాన్యతా క్రమంలో పనులు చేస్తున్నామన్నారు. వచ్చే నెల 2వ తేదీ నుంచి మరోసారి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు.
టీవర్క్స్ తో ఒప్పందం
పాలనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేందుకు టీ-వర్క్స్‌తో ఒప్పందం చేసుకున్నట్లు కమిషనర్తెలిపారు. భవిష్యత్తులో సీఎంసీ కార్యకలాపాల్లో టెక్నాలజీ వినియోగం మరింత పెంచుతామన్నారు. ముఖ్యంగా బయో యూరినల్స్, స్ట్రీట్ లైట్లు, డస్ట్ బిన్స్ వంటివి టెక్నాలజీతో కూడినవి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
అభివృద్ధి పనులకు సీఎంసీ వద్ద సరిపడా నిధులు
అభివృద్ధి పనులకు ప్రస్తుతం సీఎంసీ వద్ద సరిపడా నిధులున్నాయని కమిషనర్చెప్పారు. హెచ్ సిటీ పనులు జరిగిన విధంగా బిల్లులు ఇస్తున్నామన్నారు. రోడ్ల విస్తరణకు సంబంధించి 90 శాతం వరకు టీడీఆర్ ఇస్తున్నామని, తప్పనిసరి పరిస్థితుల్లో కోర్డు కేసులు ఉన్న వాటికి మాత్రమే పరిహారం కింద నగదు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 5 రోడ్ల విస్తరణకు ప్రయార్టీ ఇచ్చామన్నారు.
సీ అండ్ డీ వేస్టేజీ ఎక్కడ పడితే అక్కడ వేయొద్దు
కన్స్ట్రక్షన్ అండ్ డిమాలిష్(సీ అండ్ డీ) వేస్టేజీ ఎక్కడ పడితే అక్కడ పడేయొద్దని కమిషనర్ సూచించారు. రోడ్ల పక్కన పడేస్తున్న వాహనాలను సీజ్ చేస్తున్నామన్నారు. సీ అండ్ డీ వేస్టేజీ ప్లాంట్లకు తరలించాలని, ఇందుకోసం యాప్ ను కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం అమలవుతున్న క్యూర్ చట్టంలో కూడా ఈ అంశం ఉందన్నారు.
త్వరలో సీఎంసీ కొత్త భవనం, రీ సైక్లింగ్ ప్లాస్టిక్ తో రోడ్లు
సీఎంసీ నూతన భవన నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించనున్నట్లు కమిషనర్ వెల్లడించారు. ఇందుకు సంబంధించి డీపీఆర్ రూపొందిస్తున్నామని, నెట్ జీవో భవనం నిర్మిస్తామన్నారు. అలాగే, సీఎంసీలో రీ సైక్లింగ్ చేసే ప్లాస్టిక్ తో రోడ్లు, ఫుట్ పాత్ లు, కుర్చీలు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. దీనివల్ల ప్లాస్టిక్ ఒకే దగ్గర స్థిరంగా ఉండిపోతుందన్నారు.
