మీ పిల్లలపై  ఓ కన్నేసి ఉంచండి..తల్లిదండ్రులు ప్రేమతో నిఘా పెట్టాలి: సీఎం రేవంత్

 మీ పిల్లలపై  ఓ కన్నేసి ఉంచండి..తల్లిదండ్రులు ప్రేమతో నిఘా పెట్టాలి: సీఎం రేవంత్
  • ఆన్​లైన్​లో ఏం చేస్తున్నారో  ప్రేమగా తెలుసుకోండి
  • వాళ్లను సురక్షితంగా ఉంచేందుకు కలిసి పనిచేయాలి
  • చైల్డ్ ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ సేఫ్టీ ఫ్రేమ్‌‌‌‌‌‌‌‌వర్క్ తెస్తామన్న సీఎం రేవంత్
  • హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో దేశంలోనే తొలి చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు
  • సైబర్ నేరాలకు ‘1930’, పిల్లల సహాయానికి ‘1098’
  • ‘ఈజ్ ఆఫ్ జస్టిస్’తోనే సత్వర న్యాయం: మేఘ్వాల్
  • పిల్లలే దేశానికి అత్యంత విలువైన ఆస్తి: సుప్రీం న్యాయమూర్తులు

హైదరాబాద్, వెలుగు: ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువ సమయం ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో గడుపుతున్నారని, కానీ ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెట్‌‌‌‌‌‌‌‌లో వాళ్లు  ఏం చూస్తున్నారో, ఏం చేస్తున్నారో చాలా మంది తల్లిదండ్రులకు తెలియడం లేదని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. తల్లిదండ్రులందరూ పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలని సూచించారు. సైబర్​ నేరాలకు, లైంగిక వేధింపులకు గురికాకుండా  పిల్లలను కాపాడుకునేందుకు మనమంతా కలిసి పనిచేయాలన్నారు.   పిల్లలపై ఆన్‌‌‌‌‌‌‌‌లైన్  వేధింపులు, సైబర్ దోపిడీని నిరోధించేందుకు ప్రభుత్వం త్వరలోనే సమగ్ర ‘చైల్డ్ ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ సేఫ్టీ ఫ్రేమ్‌‌‌‌‌‌‌‌వర్క్’ను రూపొందిస్తుందని ప్రకటించారు.  

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని తాజ్ కృష్ణా హోటల్‌‌‌‌‌‌‌‌లో జాతీయ న్యాయ సేవాధికార సంస్థ (నల్సా), తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ (టీజీఎస్ఎల్ఎస్ఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సౌత్ జోన్ రీజినల్ కాన్ఫరెన్స్’కు సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘పిల్లలు అమాయకులు. ఏది నిజం? ఏది అబద్ధం? ఏది మంచిది? ఏది ప్రమాదకరం? అన్నది వారు వెంటనే గుర్తించలేరు.. తెలియక  చేసే చిన్న పొరపాట్లు కూడా పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. అందుకే తల్లిదండ్రులకు నాదో విజ్ఞప్తి. ఇంటర్​నెట్​, ఏఐ వాడుతున్న మీ పిల్లలను నిత్యం గమనించండి. వారు ఇంటర్నెట్‌‌‌‌‌‌‌‌లో ఏం చేస్తున్నారు? ఏం చూస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? అనేది తెలుసుకోండి. వారిని తప్పుపట్టేలా కాదు.. ఆసక్తితో, అవగాహనతో, ప్రేమతో మాట్లాడండి. ఎందుకంటే.. వాళ్లు మన పిల్లలు. వారికి మన మద్దతు కావాలి. మన మార్గదర్శకత్వం కావాలి. మన పిల్లలను సురక్షితంగా ఉంచేందుకు మనమంతా కలిసి పనిచేయాలి’’ అని సూచించారు. 


 సైబర్ ప్రపంచంలో చిన్నారులకు ఎదురవుతున్న ప్రమాదాల తీవ్రతను సీఎం తన ప్రసంగంలో వివరించారు. ఇంటర్నెట్, ఏఐ మానవాళికి అపారమైన జ్ఞానాన్ని, నిరంతర అనుసంధానాన్ని అందించినప్పటికీ, అమాయకులైన పిల్లల జీవితాలను తీవ్ర గందరగోళంలోకి నెడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్‌‌లైన్ వేధింపులకు గురవుతున్న పిల్లలు భయంతో తల్లిదండ్రులకు  చెప్పుకోలేకపోతున్నారని అన్నారు. నేరస్తులకు కేవలం శిక్ష పడేలా చేయడం మాత్రమే న్యాయం కాదని, బాధితులైన పిల్లల గౌరవాన్ని పునరుద్ధరించి, వారికి వారి బాల్యాన్ని తిరిగి అందించినప్పుడే సంపూర్ణ న్యాయం చేకూరినట్లవుతుందని స్పష్టంచేశారు. 

 దేశంలోనే మొట్టమొదటి చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు..

 దేశంలోనే మొట్టమొదటి చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టును హైదరాబాద్‌‌లో ఏర్పాటు చేశామని సీఎం రేవంత్‌‌రెడ్డి​తెలిపారు. పోలీస్, భరోసా కేంద్రాలు, చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, స్పెషల్ కోర్టులు, లీగల్ సర్వీసెస్ అథారిటీలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తెచ్చి సమగ్ర వ్యవస్థలా పనిచేయాలని నిర్దేశించారు. ప్రస్తుతం భరోసా కేంద్రాల ద్వారా బాధితులకు పోలీస్ రక్షణ, వైద్య సహాయం, న్యాయ సాయం, కౌన్సిలింగ్ ఒకే వేదికపై అందుతున్నాయని గుర్తుచేశారు.  పోలీస్ విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ‘షీ భరోసా సైబర్ ల్యాబ్స్’ను నడుపుతున్నామని, ‘సైబర్ హ్యాట్’ కార్యక్రమం ద్వారా విద్యార్థులను, ఉపాధ్యాయులను అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు. స్కూళ్లలో విద్యార్థులే తోటి విద్యార్థుల కోసం ‘సైబర్ అంబాసిడర్లు’గా మారుతున్నారని వివరించారు. లీగల్ సర్వీసెస్ అథారిటీ, పాఠశాల విద్యాశాఖ ఒప్పందం ద్వారా చట్టపరమైన హక్కులపై పిల్లలకు అవగాహన కల్పిస్తున్నామని, ఇప్పటివరకు 3 వేల మందికి పైగా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్టు వెల్లడించారు.

బాధిత చిన్నారులకు అన్నివిధాలా అండ .. 

బాధిత చిన్నారులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని, తక్షణ ఆర్థిక సాయం అందించడంతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, ఉచిత ప్రవేశాలు కల్పిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. న్యాయ సేవాధికార సంస్థ సేవలను ప్రతి జిల్లాకు, మారుమూల గ్రామాలకు విస్తరించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందన్నారు. ఇదే సమయంలో తల్లిదండ్రుల బాధ్యతను గుర్తుచేస్తూ సీఎం కీలక సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రెండు అత్యవసర హెల్ప్‌‌లైన్ నంబర్లను గుర్తుంచుకోవాలని, సైబర్ నేరాల బారిన పడితే ‘1930’కు, పిల్లల సహాయం కోసం ‘1098’ నంబర్‌‌కు తక్షణమే కాల్ చేయాలని పిలుపునిచ్చారు.  

స్థానిక భాషలోనే న్యాయ ప్రక్రియ ఉండాలి: కేంద్ర మంత్రి మేఘ్‌‌వాల్‌‌

సామాన్య ప్రజలకు న్యాయం చేరువ కావాలంటే న్యాయ వ్యవస్థలో ‘ఈజ్ ఆఫ్ జస్టిస్’ విధానాన్ని మూడు కీలక స్తంభాలపై పకడ్బందీగా అమలు చేయాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌‌వాల్‌‌ స్పష్టం చేశారు. ‘ఈజ్ ఆఫ్ అండర్‌‌స్టాండింగ్’, ‘ఈజ్ ఆఫ్ ఎంగేజ్‌‌మెంట్’, ‘ఈజ్ ఆఫ్ వర్కింగ్’ అనే మూడు సూత్రాలను న్యాయశాఖ వేగంగా ముందుకు తీసుకెళ్తోందని వివరించారు. ‘ఈజ్ ఆఫ్ అండర్‌‌స్టాండింగ్’ ప్రకారం.. న్యాయం పొందే వ్యక్తికి అర్థమయ్యే సరళమైన స్థానిక భాషలోనే న్యాయ ప్రక్రియ ఉండాలని, అందుకే నల్సా చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ స్కీమ్–2024 ముసాయిదాను, నల్సా థీమ్ సాంగ్ ‘ఏక్ ముక్తీ ఆస్మాన్’ను తెలుగులో విడుదల చేశామన్నారు. ‘ఈజ్ ఆఫ్ ఎంగేజ్‌‌మెంట్’ ద్వారా బాధితులు న్యాయాన్ని ఆశ్రయించే వ్యవస్థలను అందుబాటులోకి తేవాలని, ఇందులో భాగంగానే ప్రతి జిల్లాలో డీఎల్ఎస్ఏలు, లీగల్ సర్వీసెస్ క్లినిక్స్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, చైల్డ్‌‌లైన్ 1098, ప్రభుత్వ టెలీ-లా  ప్రాజెక్టులు, న్యాయబంధు (ప్రో-బోనో లాయర్లు) సేవలను మరింత బలోపేతం చేసి తక్షణ రిఫెరల్ వ్యవస్థను తెస్తున్నట్టు చెప్పారు.‘ఈజ్ ఆఫ్ వర్కింగ్’ కింద న్యాయవాదులు, జడ్జీల పనితీరు సులభతరం చేసేందుకు ‘ఈ- కోర్టుల ఫేజ్–3’ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.7,210 కోట్ల భారీ బడ్జెట్‌‌ను మంజూరు చేసిందని, దీంతో ఈ-ఫైలింగ్, వర్చువల్ కోర్టులు, డిజిటల్ సేవా కేంద్రాలు క్షేత్రస్థాయికి చేరుతున్నాయని తెలిపారు. సైబర్ క్రైమ్ కేసుల్లో ఐటీ యాక్ట్, పోక్సో, బీఎన్ఎస్ఎస్, బీఎస్ఏ నిబంధనలకు తగ్గట్టుగా డిజిటల్ ఎవిడెన్స్ సేకరణ, భద్రపరచడంపై పోలీస్, ప్రాసిక్యూటర్లు, లీగల్ ఎయిడ్ న్యాయవాదులకు క్రమం తప్పకుండా ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ గత మూడేండ్ల కాలంలో 50,318 మంది పేదలు, మహిళలు, పిల్లలకు ఉచిత న్యాయ సహాయం అందించడం, 14,386 న్యాయ అవగాహన సదస్సులు నిర్వహించడం విశేషమని కొనియాడారు.  జాతీయ లోక్ అదాలత్ ద్వారా తెలంగాణలో రికార్డు స్థాయిలో 2.77 కోట్ల పెండింగ్ కేసులు పరిష్కారమయ్యాయని వెల్లడించారు.

పిల్లలే దేశానికి విలువైన ఆస్తి: సుప్రీంకోర్టు న్యాయమూర్తులు

మారుతున్న సామాజిక పోకడలు, డిజిటల్ దుష్పరిణామాలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఆందోళన వ్యక్తం చేశారు. జస్టిస్ పీఎస్ నరసింహ మాట్లాడుతూ.. జననాల రేటు (టోటల్ ఫెర్టిలిటీ రేట్) సాధారణ జనాభా స్థిరీకరణ స్థాయి అయిన 2.1 శాతం కంటే దిగువకు.. అంటే 1.97 శాతానికి పడిపోయిందని తెలిపారు. భవిష్యత్తులో జపాన్‌‌లాంటి దేశాల తరహాలో భారత్‌‌లోనూ వృద్ధుల సంఖ్య పెరిగి, పిల్లల సంఖ్య వేగంగా క్షీణించనుందని, అందువల్ల సమాజంలో ప్రతి బిడ్డా దేశానికి వెలకట్టలేని ‘అత్యంత విలువైన ఆస్తి’గా మారబోతున్నారని తెలిపారు.  నాగరికత పేరిట ప్రస్తుతం పిల్లలకు ‘సమయం కేటాయించకపోవడమే’ అత్యంత తీవ్రమైన సమస్యగా పరిణమించిందన్నారు. జస్టిస్ అలోక్ అరాధే మాట్లాడుతూ.. టెక్నాలజీ ఒకవైపు విద్యార్థిని తరగతి గదితో అనుసంధానిస్తుంటే, అదే సమయంలో అపరిచిత నేరగాళ్ల ఉచ్చులోకి లాగుతోందన్నారు. ఆన్‌‌లైన్ గేమింగ్ బెట్టింగ్‌‌లు, డీప్‌‌ఫేక్స్, సెక్స్‌‌టార్షన్, ఆన్‌‌లైన్ గ్రూమింగ్, సైబర్ స్టాకింగ్‌‌లాంటి డిజిటల్ నేరాలు పిల్లల ఆత్మగౌరవాన్ని, భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయన్నారు. డిజిటల్ సైబర్ స్పేస్‌‌లో జరిగే అకృత్యాలకూ పోక్సో  చట్టం సంపూర్ణంగా వర్తిస్తుందని తేల్చిచెప్పారు.