ప్రపంచ మంచి కోసం కలిసి పని చేద్దాం

ప్రపంచ మంచి కోసం  కలిసి పని చేద్దాం

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా నమ్మకం సన్నగిల్లిందని, ఉక్రెయిన్‌‌ యుద్ధంతో ఈ అపనమ్మకం మరింత ఎక్కువైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ పరిస్థితిని ప్రతి ఒక్కరిపై నమ్మకంగా మార్చాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. శనివారం ఢిల్లీలో భారత్ మండపం కన్వెన్షన్ సెంటర్‌‌‌‌లో జరిగిన సమిట్‌‌లో జీ20 లీడర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ముందుగా మొరాకో భూకంప బాధితులకు సంతాపం తెలిపారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మొరాకో వెంట మొత్తం ప్రపంచం ఉందని, సాయం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఇండియా చేపట్టిన జీ20 ప్రెసిడెన్సీ.. దేశం లోపల, బయట అందరినీ కలుపుకుని పోవడానికి చిహ్నంగా నిలిచిందని చెప్పారు. ఇది ప్రపంచ ప్రయోజనాల కోసం అందరం కలిసి పని చేయాల్సిన సమయమన్నారు. 

‘‘ప్రపంచ ఎకానమీలో అనిశ్చితి, నార్త్–సౌత్ విభజన, వెస్ట్–ఈస్ట్ మధ్య అంతరం, ఆహార నిర్వహణ, ఇంధనం, ఎనర్జీ, ఎరువులు, టెర్రరిజం, సైబర్ సెక్యూరిటీ, ఆరోగ్యం, వాటర్ సెక్యూరిటీ తదితర సుదీర్ఘ సవాళ్లకు పరిష్కారాలు కనుగొనేందుకు కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. కరోనా మహమ్మారి తర్వాత నమ్మకం సన్నగిల్లడం (ట్రస్ట్ డెఫిసిట్) అనే కొత్త సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. దురదృష్టవశాత్తు ఉక్రెయిన్ యుద్ధంతో అది మరింత ఎక్కువైంది. కరోనా లాంటి మహమ్మారిని ఓడించిన మనం.. ఈ ట్రస్ట్ డెఫిసిట్‌‌పైనా గెలవగలం. ఈ గ్లోబల్ ట్రస్ట్ డెఫిసిట్‌‌ను నమ్మకంగా, విశ్వాసంగా మార్చాలని జీ20 ప్రెసిడెంట్‌‌గా ఇండియా పిలుపునిస్తున్నది’’ అని అన్నారు. మన బాధ్యతలను పూర్తి చేసేందుకు హ్యూమన్ సెంట్రిక్ అప్రోచ్‌‌తో ముందుకు సాగాల్సి ఉందని చెప్పారు.