రూ. 2 వేల కోట్ల విలువైన భూములు కొట్టేసే ప్లాన్​: పొంగులేటి

రూ. 2 వేల కోట్ల విలువైన భూములు కొట్టేసే ప్లాన్​: పొంగులేటి
  • జీవో 59 కింద బినామీల పేరుతో గత ప్రభుత్వ పెద్దల యత్నం: మంత్రి పొంగులేటి
  • రేషన్​ కార్డు, ఆరోగ్య శ్రీ కార్డు వేర్వేరుగా ఇవ్వాలని ఆలోచన
  • భగీరథపై గత సర్కారువి బోగస్​ లెక్కలే..30% ఇండ్లకు నో ట్యాప్​
  • కౌలు రైతులకు రైతుభరోసా ఇస్తం.. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని వ్యాఖ్య

హైదరాబాద్​, వెలుగు: గత బీఆర్​ఎస్​ ప్రభుత్వంలో  జీవో 59 కింద ఎలాంటి స్ట్రక్చర్​లేకున్నా విలువైన ప్రభుత్వ భూములను కొల్లగొట్టాలని చూశారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి అన్నారు. ఒక్కో ఎకరం కనీసం రూ.90 కోట్ల నుంచి రూ. వంద కోట్లు ఉన్నచోట బినామీల పేరుతో ఏకంగా 20 ఎకరాలకు 59 జీవో కింద క్రమబద్ధీకరణ చేసుకోవాలని చూశారని చెప్పారు. వాటిని ప్రస్తుతం ఆపేసినట్టు తెలిపారు. రుణమాఫీని అమలు చేసి తీరుతామని చెప్పారు. మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి సెక్రటేరియేట్​లో మీడియాతో చిట్​చాట్​ చేశారు.  గత బీఆర్​ఎస్​ సర్కారు హయాంలో రైతుబంధు కింద రూ. వేల కోట్లు పక్కదారి పట్టాయని అన్నారు. రైతుభరోసాకు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నట్టు చెప్పారు. 

కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వం మిషన్​ భగీరథ కింద వంద శాతం నల్లా కనెక్షన్లు ఉన్నాయని తప్పుడు రిపోర్టులు ఇచ్చిందని, రాష్ట్రంలో 30 శాతానికి పైగా ఇండ్లకు మంచినీటి ట్యాప్​ కనెక్షన్​ లేదని తమ సర్వేలో వెల్లడైందని తెలిపారు. ఈ నెలాఖరులోగా రాష్ట్ర బడ్జెట్‌‌కు ఆమోదం తెలుపుతామని, ఈ నెల20 తర్వాత అసెంబ్లీ సమావేశాలను ప్రారంభిస్తామని  తెలిపారు. జర్నలిస్టులకు కచ్చితంగా ఇండ్ల స్థలాలను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అర్హుల గుర్తింపు కోసం మీడియా అకాడమీతో  చర్చలు జరుపుతున్నామని, అధికారులతో కూడా చర్చిస్తామని, త్వరలోనే జర్నలిస్టులు శుభవార్త వింటారని తెలిపారు.  త్వరలోనే రెవెన్యూ చట్టాన్ని సవరిస్తామని, ధరణిలో పలు మార్పులు తీసుకొస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో ఒకే దరఖాస్తు పెట్టి,  ఆ అప్లికేషన్​ను ఎలా చేయాలన్న దానిపై తహసీల్దార్, ఆర్డీవోలు నిర్ణయం తీసుకునేలా రూపొందిస్తున్నామని తెలిపారు.
  
సర్వే నెంబర్లవారీగా భూముల విలువ పున:సమీక్ష

భూముల మార్కెట్ విలువను  గత ప్రభుత్వం అడ్డగోలుగా పెంచిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి పేర్కొన్నారు. తాము ఈసారి అలా కాకుండా శాస్త్రీయ పద్ధతిలో భూముల విలువలను పెంచాలని నిర్ణయించామని తెలిపారు. కొన్నిచోట్ల ఎక్కువ ధరలు ఉండగా.. మరికొన్ని చోట్ల తక్కువ ఉన్నాయని, అలా కాకుండా అసలు ఆయా ప్రాంతాల్లో ఎంత ధర ఉండాలి? ఎంత పెంచాలి? అన్న దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారని, మరోసారి దానిపై చర్చించిన తర్వాత భూముల విలువను పెంచుతామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో సర్వే నెంబర్లవారీగా భూముల విలువలను పునఃసమీక్షిస్తామని తెలిపారు. రాబోయే 5 ఏండ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు పేదలకు ఇవ్వాలని నిర్ణయించామని పేర్కొన్నారు.  

త్వరలోనే కాంగ్రెస్​లోకి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు 

2018 ఎన్నికల్లో బీఆర్‌‌ఎస్‌‌కు 88 సీట్లు రాగా, కాంగ్రెస్‌‌కు19 సీట్లు వచ్చాయని,  అయినా తృప్తి చెందని కేసీఆర్​అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్‌‌ఎస్​లో విలీనం చేసుకున్నారని మంత్రి పొంగులేటి చెప్పారు. ప్రస్తుతం తమను 64 స్థానాల్లో గెలిపించి ప్రజలు అధికారం కట్టబెట్టారని, దీనిని జీర్ణించుకోలేని కేసీఆర్.. తమ ప్రభుత్వాన్ని కూలగొడతానని మాట్లాడారని అన్నారు. అందులో భాగంగానే చేరికలు జరుగుతున్నాయని తెలిపారు. త్వరలోనే పెద్ద సంఖ్యలో గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్​లో చేరుతారని, ఈ సంఖ్య 10 దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.
 
వేర్వురుగా రేషన్​, హెల్త్​ కార్డులు

ప్రజావాణిలో ఎక్కువగా ఆసరా పింఛన్స్​, రేషన్ కార్డుల కోసమే దరఖాస్తులు వస్తున్నాయని మంత్రి పొంగులేటి తెలిపారు. చాలామంది ఆరోగ్యశ్రీ కార్డు కోసమే తెల్లరేషన్ కార్డులు తీసుకున్నారని చెప్పారు. ఈ సారి రెండింటికీ సంబంధం లేకుండా తెల్లరేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులు జారీచేయాలని ఆలోచిస్తున్నట్టు చెప్పారు. దీనిపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని  పేర్కొన్నారు. 

జీవో 59 కింద వేల కోట్ల భూములు స్వాహా

గత ప్రభుత్వ హయాంలో 59 జీవో  కింద చేసిన రిజిస్ట్రేషన్లలో చాలా అక్రమాలు జరిగాయని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ అవినీతిలో భాగంగా ఎకరాల్లో ఉన్న భూమిని 999 గజాలు, 990 గజాలు, 850 గజాల్లో రిజిస్ట్రేషన్ చేయించి, వందల ఎకరాల భూమిని 59 జీవో కింద క్రమబద్ధీకరించుకున్నారని మంత్రి పేర్కొన్నారు. ఎలాంటి కట్టడాలు లేకుండానే వాటిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. శేరిలింగంపల్లి సబ్ రిజిస్ట్రార్‌‌తోపాటు మరికొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, తహసీల్దార్ల పరిధిలో ఇలాంటి అక్రమాలు జరిగినట్టు గుర్తించామని, కొందరు తహసీల్దార్లు ఈ అక్రమాల్లో భాగస్వామ్యం అయ్యారని గుర్తించామని పేర్కొన్నారు.  ఎల్ఆర్‌‌ఎస్ దరఖాస్తులను క్లియర్ చేయాలని అధికారులను ఇప్పటికే ఆదేశించామన్నారు. ప్రస్తుతం స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో 32 నుంచి 36 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆదాయం బాగా వస్తున్నట్టు తాము గుర్తించామని, చాలామంది సబ్ రిజిస్ట్రార్లు ఇక్కడ పనిచేయడానికి సిఫారసు లేఖలను తీసుకొస్తారని తెలిపారు. ఈ సారి బదిలీలు పారదర్శకంగా చేపడుతామని, సిఫారసు లేఖలను తీసుకొస్తే వారిని దూరప్రాంతాలకు బదిలీ చేస్తానని మంత్రి హెచ్చరించారు.