
- కావాలని ప్రాజెక్టులు కొట్టుకుపోయేలా డిజైన్ చేస్తారా
- రూ.600 కోట్ల నష్టానికి.. లక్ష కోట్లు తిన్నాడని ప్రచారమేంటి
- బీఆర్‍ఎస్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య
వరంగల్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో టెక్నికల్ లోపాలుంటే తప్పేంటి అని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. కావాలని ఎవరైనా ప్రాజెక్టులు కొట్టుకుపోయేలా డిజైన్ చేస్తారా? అని అడిగారు. ‘‘నీరు ఎక్కువొస్తే అడపదడపా పిల్లర్లు కొట్టుకుపోవడం సహజమే కదా. పిల్లర్ల రిపేర్ల కోసం మహా అంటే రూ.450 నుంచి 600 కోట్ల నష్టం వస్తే.. రూ.లక్ష కోట్లు తిన్నాడని ప్రచారం చేస్తారా.. ఇప్పుడే ఈ రిపోర్టులు ఎందుకిస్తున్నరు..” అని అడిగారు. ఆదివారం పొన్నాల లక్ష్మయ్య హనుమకొండలో ప్రెస్‍మీట్ లో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 86 పిల్లర్లు ఉంటే 3 పిల్లర్లకు సమస్య వచ్చిందని తెలిపారు. దీనివల్ల మహా అంటే రూ.450 కోట్ల నుంచి 600 కోట్ల వరకు నష్టం వాటిల్లిందన్నారు. అయితే.. 145 టీఎంసీల సామర్థ్యం గల ప్రాజెక్టులో వందల కిలోమీటర్లు పెట్టి పైపులేసి నీటిని ఇచ్చిన ఘనతను వదిలేసి..చిన్న సమస్యపై బుద్ధిన్నోడెవడైనా కామెంట్లు చేస్తారా అని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.91 వేల కోట్లు ఖర్చు పెడితే.. రూ.లక్ష కోట్లు అంటూ రాజకీయం చేయడమేంటన్నారు.
మంత్రి ఉత్తమ్ అబద్ధాలు చెప్తున్నడు
దేవాదుల ప్రాజెక్ట్ గురించి పూర్తిస్థాయిలో తెలియని ఉత్తమ్‍కుమార్ రెడ్డి గుడ్డిగా రెండేడ్లలో ప్రాజెక్ట్ పూర్తిచేసి 6 లక్షల ఎకరాలకు నీరు అందిస్తామని అబద్ధాలు చెప్తున్నాడని లక్ష్మయ్య ఆరోపించారు. మంత్రులు ఉత్తమ్‍కుమార్‍రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‍రెడ్డి శనివారం దేవాదుల ప్రాజెక్టు పనులను పరిశీలించి మాట్లాడిన విషయం తెల్సిందే. ఈ సందర్భంగా ఉత్తమ్వ్యాఖ్యలపై పొన్నాల స్పందించారు. దేవాదుల ప్రాజెక్టులోని మూడు ఫేజుల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి కోసం ఒక్క పంప్ మాత్రమే వినియోగిస్తున్నారని, మిగతా పంపులు ఎందుకు నడపడంలేదని ప్రశ్నించారు. 38 టీఎంసీల సామర్ధ్యం ఉండగా ఈ ఏడాది 17 నుంచి 18 టీఎంసీల నీటిని మాత్రమే వాడుకున్నారని ఆరోపించారు. నీటిని సరిగా వాడుకోలేకపోవడంవల్ల 234 టీఎంసీల నీళ్లు ఎల్లంపల్లి నుంచి కిందకు పోయాయన్నారు. మహబూబ్‍నగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కృష్ణా జలాలను వాడుకోలేని వారికి మంత్రి పదవులెందుకని అడిగారు. నాగార్జునసాగర్‍లోని 4 టీఎంసీలను ఏపీకి తరలించుకువెళ్తే సొంత జిల్లాకు చెందిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‍కు వారం వరకు తెలియకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో గడిచిన 16 నెలల్లో కొత్త ఆయకట్టు ఏమి తీసుకురాకుండానే తాము పంట సాగులో రికార్డ్ సృష్టించామని ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు.