
న్యూఢిల్లీ: పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేశారన్న ఆరోపణలపై ఆరుగురు భారతీయులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ప్రముఖ ట్రావెల్ బ్లాగర్, యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కూడా ఉన్నారు. హర్యానా, పంజాబ్‌లో వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో వారంతా ముఠాగా ఏర్పడి గూఢచర్యం చేస్తున్నారు.
‘ట్రావెల్ విత్ జో’ పేరుతో యూట్యూబ్ చానెల్ నడుపుతున్న జ్యోతి.. కమీషన్ ఏజెంట్ల సాయంతో వీసా పొంది 2023లో పాకిస్తాన్ లో పర్యటించింది. తన పర్యటనలో ఎషానుర్ రహీం అలియాస్ డానిష్ అనే వ్యక్తితో పరిచయం చేసుకుని సంబంధాలు పెంచుకుంది. డానిష్ న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ లో స్టాఫ్ మెంబర్ గా పనిచేస్తున్నాడు. జ్యోతిని డానిష్ పలువురు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్(పీఐఓ) కు పరిచయం చేశాడు.
వాట్సాప్, టెలిగ్రాం, స్నాప్ చాట్ వంటి ప్లాట్ ఫాంలలో జ్యోతి వారితో టచ్ లో ఉంటూ మన దేశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని షేర్ చేసింది. అలాగే పాక్ గురించి సోషల్ మీడియాలో పాజిటివ్‌గా ప్రచారం చేసింది. ఓ పీఐఓతో జ్యోతి సన్నిహిత సంబంధం కూడా ఏర్పరుచుకుంది. అతడితో కలిసి బాలిలో పర్యటించింది. హిస్సార్ లో జ్యోతిని అదుపులోకి తీసుకుని పలు సెక్షన్ల కింద ఆమెపై కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. నిందితురాలి నుంచి లిఖితపూర్వక వాంగ్మూలం తీసుకున్నామని, ఆమె కేసును ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్‌కు అప్పగించామని వెల్లడించారు.
అరెస్టయిన వారిలో జ్యోతితో పాటు మరో కీలక నిందితురాలు గుజాలా కూడా ఉందని చెప్పారు. ‘‘పంజాబ్ లోని మాలేర్ కోట్ కు చెందిన గుజాలా ఈ ఏడాది ఫిబ్రవరి 27న వీసా కోసం ఢిల్లీలోని పాక్ హై కమిషన్ ను సంప్రదించింది. అక్కడ డానిష్ తో పరిచయం చేసుకుంది. రెగ్యులర్ గా అతనితో టచ్ లో ఉంటూ వాట్సాప్, టెలిగ్రాంలో దేశానికి సంబంధించిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ను ఆమె షేర్ చేసింది. డానిష్ తో ఆమె రొమాంటిక్ రిలేషన్ షిప్ కూడా నెరిపింది. పాక్ కు వెళ్లేందుకు ఆమెకు వీసా ఇప్పించడంలో డానిష్ సాయం చేశాడు.
మాలేర్ కోట్లాకే చెందిన తన ఫ్రెండ్ భానూ నస్రీనాతో కలిసి గత నెల 23న పాక్ కు వెళ్లింది. ఇక మిగతా నిందితులను యమీన్ మొహమ్మద్ (మాలేర్ కోట్లా), హర్యానాకు చెందిన దేవీందర్ సింగ్ ధిల్లాన్, అర్మాన్ గా గుర్తించాం” అని పోలీసులు వివరించారు. కాగా.. గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో ఇటీవల డానిష్ ను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపించింది.
ముంబైలో ఇద్దరు స్లీపర్ సెల్ సభ్యుల అరెస్టు
దేశంలోని పలు ప్రాంతాల్లో టెర్రర్ దాడులకు పాల్పడేందుకు కుట్రపన్నిన ఇద్దరు ఐస్ఐఎస్ స్లీపర్ సెల్ సభ్యులు అబ్దుల్లా ఫయాజ్ షేక్ అలియాస్ డైపర్ వాలా, తల్హా ఖాన్‌ను ముంబైలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అరెస్టు చేశారు.