- ప్రిన్సిపాల్, హాస్టల్ మ్యాట్రిన్ సస్పెన్షన్
పాలకుర్తి, వెలుగు: జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గిరిజన గురుకులంలో క్షుద్ర పూజల ఘటనలో ప్రిన్సిపాల్ రేణుక, మ్యాట్రిన్ మల్లేశ్వరీని సస్పెండ్ చేశారు. ఈ మేరకు గిరిజన గురుకులాల సెక్రటరీ డీఎస్ వెంకన్న ఉత్తర్వులు జారీ చేశారు. మండలంలోని గూడూరు గ్రామ గిరిజన గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ రేణుక రాథోడ్ క్షుద్ర పూజల పేరిట ట్రాన్స్ జెండర్లతో పూజలు చేయించారు. ప్రిన్సిపాల్ కు పీడకలలు వస్తుండడంతో ఇటీవల ట్రాన్స్ జెండర్లను స్కూల్కు పిలిపించి నిమ్మకాయలు, గుమ్మడికాయతో దిష్టి తీయించి పూజలు చేశారు. పసుపు కుంకుమ కలిపిన నీళ్లను విద్యార్థులపై చల్లించింది.
దీనిని విద్యార్థులు నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. క్షుద్ర పూజలతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, నాసిరకమైన భోజనం పెడుతున్నారని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై మీడియా, సోషల్ మీడియాలో కథనాలు రావడంతో గురుకులాల సెక్రటరీ డీఎస్ వెంకన్న విచారణ అనంతరం ఇరువురిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
