
- హిమాచల్‌కు వరద సాయం చేయట్లే: ప్రియాంకా గాంధీ
- సిమ్లాలో మాజీ సీఎం వీరభద్ర సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సోనియా గాంధీ
సిమ్లా: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, ఎంపీ ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఇటీవల భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన హిమాచల్ ప్రదేశ్‌కు సరైన సహాయం చేయలేదని మండిపడ్డారు. సిమ్లాలోని దౌలత్ సింగ్ పార్క్‌లో ఏర్పాటు చేసిన హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం వీరభద్ర సింగ్ కాంస్య విగ్రహాన్ని సోమవారం ఏఐసీసీ మాజీ చీఫ్ సోనియా గాంధీ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి ప్రియాంక గాంధీతో పాటు హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు, కాంగ్రెస్ లీడర్లు సచిన్ పైలెట్, దీపెందర్ హుడా, రజిని పాటిల్, రాజీవ్ శుక్లా, కేబినెట్ మంత్రులు, భారీ స్థాయిలో కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
అనంతరం నిర్వహించిన సభలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. ‘‘మనకు మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, వీరభద్ర సింగ్‌లాంటి నాయకులు కావాలి. వారు ఎల్లప్పుడూ నిజాయితీ, సత్య మార్గాన్ని అనుసరించారు.
రాహుల్ గాంధీ లాంటి వారు ధైర్యంగా ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తున్నారు. మన పూర్వీకుల కలలను నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. దేశాభివృద్ధికి సరైన మనస్తత్వం, నిజాయితీ గల రాజకీయాలు ముఖ్యం”అని ఆమె పేర్కొన్నారు.