
మేడ్చల్ వెలుగు: ఎన్నికల్లో డ్యూటీలు నిర్వహించే పీఆర్టీయూటీఎస్ యూనియన్‌కు చెందిన టీచర్లు.. బర్త్ డే పార్టీ పేరిట దావత్ చేసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. అక్కడికి ఎన్నికల అధికారులు వెళ్లగానే వారు పారిపోయారు. ఈ ఘటన మంగళవారం రాత్రి మేడ్చల్ పరిధి కండ్లకోయలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కండ్లకోయలోని నిమ్మల గార్డెన్స్ లో ఎన్నికల్లో విధుల్లో పాల్గొనే టీచర్లు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా రాత్రి 10 గంటలు దాటినా ఫంక్షన్ హాల్లో దావత్ చేసుకుంటున్నారు.
దీంతో స్థానికులు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అక్కడికి వెళ్లిన ఫ్లయింగ్ స్వ్కాడ్ అధికారులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి పార్టీ చేయడంతో 144 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా ఆన్ లైన్లో బర్త్ డే పార్టీ పేరుతో పర్మిషన్ పొంది రూల్స్‌కు విరుద్ధంగా దావత్ చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
జవహర్‌నగర్‌లో..
జవహర్‌నగర్ పరిధి లక్ష్మీనరసింహ కాలనీలోని ఓ మామిడి తోటలోనూ మంగళవారం మేడ్చల్ బీఆర్ఎస్ అభ్యర్థి ముఖ్య అనుచరులు, కార్పొరేటర్లు,నేతలతో స్థానిక నేతలు సీక్రెట్‌గా వందల మందిని తరలించి పార్టీ ఇచ్చారు. స్క్వాడ్ మేనేజర్ నాగేంద్రబాబును వివరణ కోరగా సీ విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు రావడంతో సంఘటన స్థానానికి వెళ్లి వివరాలు తెలుసుకున్నామన్నారు. బర్త్ డే పార్టీ చేసుకుంటున్నామని వారు చెప్పారని ఆయన తెలిపారు. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి పార్టీలు చేస్తున్న వారిపై జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.