
- అప్పుడు కచ్చితంగా గవర్నర్ బిల్లు పాస్ చేస్తరు: ఆర్.కృష్ణయ్య
ముషీరాబాద్, వెలుగు: ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లపై మరోసారి చట్టం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈసారి చట్టం చేసి బిల్లు గవర్నర్‌కు పంపిస్తే తప్పకుండా పాస్ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం సెక్రటేరియెట్ వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టం లేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని ఆరోపించారు. దీనిలో భాగంగా ఢిల్లీలో రెండు సార్లు ధర్నాలు చేశారని, ప్రతిరోజు సమావేశాలు ఏర్పాటు చేసి పేపర్‌లో ఉత్తుత్తి ప్రకటనలు జారీ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గవర్నర్ సంతకం పెట్టకపోయినా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని, లేకుంటే శనివారం నుంచి జరిగే అసెంబ్లీ సమావేశంలో మరోసారి బీసీ బిల్లు పెట్టి తీర్మానం చేస్తే చట్టం అవుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి రిజర్వేషన్లు పెంచే ఇష్టం లేక కేంద్రంపై దుష్ప్రచారం చేస్తూ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తోందని ఫైర్ అయ్యారు. ఇండియా కూటమికి 250 మంది ఎంపీలు ఉన్నప్పుడు పార్లమెంట్‌లో ఎందుకు బీసీ బిల్లుపై చర్చ పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకొని ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరిపురం రవికుమార్ యాదవ్, నిఖిల్, బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.