నాన్ లోకల్స్ నియోజకవర్గాన్ని విడిచి వెళ్లాలి

నాన్ లోకల్స్ నియోజకవర్గాన్ని విడిచి వెళ్లాలి
  • లేకపోతే వాహనాలు సీజ్​ చేసి చర్యలు తీస్కుంటాం 
  • రెండు మండలాల్లో 35 సమస్యాత్మక పోలింగ్ ​కేంద్రాలు
  • రాచకొండ సీపీ మహేశ్​భగవత్

చౌటుప్పల్ వెలుగు: నియోజకవర్గంలో ఎవరైనా నాన్ లోకల్స్ ఉంటే వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని, లేకపోతే వారి వాహనాలను సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్​భగవత్ హెచ్చరించారు. బుధవారం చౌటుప్పల్ లో పోలింగ్​కేంద్రాల వద్ద భద్రత ఏర్పాట్ల గురించి ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చౌటుప్పల్, నారాయణపురం మండలాల పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర, రాష్ట్ర పోలీస్ బలగాలతో భారీ భద్రత ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

 ఆ కేంద్రాల్లో భారీ బందోబస్తు

రెండు మండలాల్లో120 పోలింగ్ కేంద్రాలుండగా, 35 సెంటర్లను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామన్నారు. ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కేంద్ర బలగాల నుంచి ఐదుగురు, మరో ఐదుగురు రాష్ట్ర పోలీసులు ఉంటారన్నారు. ఇప్పటివరకు కొనసాగుతున్న చెక్ పోస్ట్ లను కొనసాగిస్తామన్నారు. రెండు మండలాల్లో ఇప్పటివరకు రూ.4 కోట్ల నగదు, వెయ్యి లీటర్ల మద్యం,11 కిలోల గంజాయి సీజ్ చేసినట్లు చెప్పారు. పాత నేరస్తులను, రౌడీ షీటర్లను బైండోవర్ చేశామన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద లైవ్ టెలికాస్ట్ ఏర్పాటు చేశామన్నారు. వెంట అడిషనల్​సీపీ సుధీర్​ బాబు, యాదాద్రి డీసీపీ కె. నారాయణరెడ్డి, రోడ్​సేఫ్టీ డీసీపీ బాల,  అడిషనల్​డీసీపీ భాస్కర్​, ఏసీపీ ఉదయ్​రెడ్డి ఉన్నారు.