ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటాం: రాహుల్‌‌ గాంధీ

ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటాం:  రాహుల్‌‌ గాంధీ

తెలంగాణలో ఇచ్చిన హామీలను అమలు చేసినట్లుగానే.. జాతీయ స్థాయిలోనూ కచ్చితంగా అమలుచేసి తీరుతాం” అని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్‌‌ గాంధీ అన్నారు. శనివారం తుక్కుగూడలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌‌ జన జాతర సభలో  కాంగ్రెస్‌‌ జాతీయస్థాయి మేనిఫెస్టో ‘న్యాయపత్రం’ను రాహుల్​ విడుదల చేశారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్‌‌ పార్టీ మేనిఫెస్టో విడుదల చేయడానికి ఇక్కడికి వచ్చాను. కొన్ని నెలల కింద అసెంబ్లీ ఎన్నికల సమయంలో తుక్కుగూడలోనే ఆరు గ్యారంటీలు విడుదల చేశాను. వాటినే జాతీయ స్థాయిలో పార్లమెంట్‌‌ ఎన్నికల సందర్భంగా  ఆవిష్కరిస్తున్నాం” అని రాహుల్​గాంధీ తెలిపారు. 

‘‘రాష్ట్రంలో రూ.500 గ్యాస్‌‌ సిలిండర్‌‌, 200 యూనిట్లు ఉచిత విద్యుత్‌‌ , గృహలక్ష్మి, ఫ్రీ బస్‌‌ టికెట్‌, మహాలక్ష్మీ స్కీమ్​లు అమలు చేస్తున్నాం. తెలంగాణ ప్రజలకు తెలుసు.. కాంగ్రెస్‌‌ పార్టీ ఎన్నికల ముందు ఏ గ్యారెంటీలు అయితే చెప్పామో వాటిని నిలబెట్టుకున్నాం..ఇప్పటికే 25 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. త్వరలో మరో 50 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. దేశంలో నిరుద్యోగ సమస్య చాలా  తీవ్రంగా ఉంది.  ‘‘ఇది కేవలం కాంగ్రెస్‌‌ పార్టీ మేనిఫెస్టోనే కాదు.. దేశ ప్రజల హృదయాల్లోంచి పుట్టినవే మా గ్యారెంటీలు.. ప్రజల గొంతుకగా వారి సమస్యలను తెలుసుకుని, వాటిని మేనిఫెస్టోలో పెట్టాం. జాతీయ మేనిఫెస్టోలోని గ్యారంటీలు ఆత్మలాంటివి” అని రాహుల్​చెప్పారు.

పేదింటి మహిళకు ఏడాదికి రూ.లక్ష

మహిళలు మన భవిష్యత్తుతో పాటు  దేశ భవిష్యత్తును చూసుకుంటారని.. ఇంట్లో పిల్లలు, కుటుంబాన్ని, బయట ఆఫీసులు, ఇతర పనుల్లో రెండు విధాలుగా పనిచేస్తున్నారని రాహుల్​ చెప్పారు. ‘‘మహిళల కోసం నారీ న్యాయ్‌‌ తీసుకువస్తున్నాం. మహిళా న్యాయం ద్వారా మహిళలకు ఏటా రూ.లక్ష ఇస్తాం. ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకు ఏడాదికి లక్ష రూపాయలు అందిస్తాం. వాటిని నేరుగా బ్యాంకులోనే జమ చేస్తాం. ఇది ఓ విప్లవాత్మక పథకం. ఇకపై దేశంలో ఏ కుటుంబానికి ఏటా రూ.లక్ష ఆదాయం కంటే తక్కువ ఉండదు. ఇది దేశ ముఖచిత్రాన్నే  మారుస్తుంది” అని ఆయన వివరించారు.