
రాజన్న సిరిసిల్ల, వెలుగు: విద్యార్థులు, యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండి, నిర్ధేశించుకున్న లక్ష్యం వైపు పయనించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టిన చర్యలపై బుధవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని కేజీబీవీలు, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీల్లో డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై పోలీస్, ఎక్సైజ్ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అంతకుముందు జిల్లాలోని ఇద్దరు క్యాన్సర్ బాధిత మహిళలకు కలెక్టర్ రూ.1.75 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు.
మహిళలకు రూ.110 కోట్లు ఆదా
మహాలక్ష్మి పథకం మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా తెలిపారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 200 కోట్ల టికెట్లపై ఉచిత బస్ ప్రయాణాలు పూర్తయిన సందర్భంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ఆవరణలో సంబరాలు నిర్వహించారు.
ఉన్నత స్థాయికి ఎదిగేందుకు చదువే ఆయుధం
వేములవాడరూరల్, వెలుగు: విద్యార్థుల ఉన్నత స్థానాలకు ఎదిగేందుకు చదువే ప్రధాన ఆయుధమని, ప్రతి విద్యార్థి కష్టపడి చదవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. బుధవారం వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి ప్రైమరీ, హన్మాజీపేట ప్రైమరీ,హైస్కూల్, అంగన్వాడీలను తనిఖీ చేశారు.