కొత్త రేషన్ కు కసరత్తు.. మూడు చోట్ల అప్లికేషన్లతో వెరిఫికేషన్​కు తిప్పలు

కొత్త రేషన్ కు కసరత్తు.. మూడు చోట్ల అప్లికేషన్లతో వెరిఫికేషన్​కు తిప్పలు
  • కొలిక్కి వచ్చిన మీ-సేవ దరఖాస్తుల సర్వే 
  • ప్రజాపాలన, గ్రామ సభల అప్లికేషన్లు క్రాస్​ చెక్

నిజామాబాద్, వెలుగు : కొత్త రేషన్​కార్డులకు అర్హుల ఎంపికను త్వరగా పూర్తి చేయాలని రెవెన్యూ శాఖను తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. దీంతో జిల్లా యంత్రాంగం కొత్త రేషన్ కార్డుల వెరిఫికేషన్​ ప్రక్రియను వేగవంతం చేస్తూ రోజువారి లక్ష్యాన్ని పెట్టుకుంది. మీ-సేవా అప్లికేషన్ల సర్వే కొలిక్కి రాగా వాటిని ప్రజాపాలన, గ్రామ సభల దరఖాస్తులను మరోసారి పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఉన్న కార్డులలో ఈ నెల 4, 453 మంది కొత్త సభ్యులను చేర్చిన అధికారులు, మరో 20 వేల మందిని చేర్చాలని కోరుతూ సివిల్ సప్లయ్​ కమిషనర్​కు ఈ నెల 5న నివేదిక పంపారు.  

దరఖాస్తుల పరిశీలనపై ఫోకస్​ 

జిల్లాలో రేషన్ కార్డుల సంఖ్య 4,02,217 ఉండగా, 13,10012 లబ్ధిదారులు ఉన్నారు. కొత్తగా చేర్చిన 4,453 మంది లబ్ధిదారులతో కలిపి మొత్తం 13,14,465 మందికి ఈ నెల సన్న బియ్యం కోటాను సివిల్ సప్లయ్​అధికారులు పంపారు. సన్నబియ్యం పంపిణీ ప్రారంభించాక  కొత్త రేషన్ కార్డుల కోసం ఒత్తిడి పెరిగింది. జనవరి 2015 నుంచి మీ-సేవలో కొత్త రేషన్ కార్డుల కోసం 88,289 అప్లికేషన్లు సివిల్ సప్లయ్​కి అందాయి. 

2024 జనవరిలో గవర్నమెంట్ నిర్వహించిన ప్రజాపాలనలో 65,205 కుటుంబాలు దరఖాస్తులు చేసుకున్నాయి. ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన గ్రామ సభల్లో మరో 81,148 దరఖాస్తులు వచ్చాయి. ఇలా కొత్త కార్డుల కోసం మూడు దఫాలుగా దరఖాస్తులు చేసుకోవడం వల్ల  ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఉంది. మీ-సేవ అప్లికేషన్​ల ​ఫీల్డ్ సర్వే రిపోర్ట్​ రెవెన్యూ ఇన్​స్పెక్టర్ నుంచి తహసీల్దార్​ ద్వారా సివిల్​ సప్లయ్ డీఎస్​వోకు చేరుతుంది. ప్రభుత్వ అనుమతి లభించిన వెంటనే కొత్త కార్డులు మంజూరు చేసి బియ్యం కోటా రిలీజ్​ చేస్తారు. 

ఈ ప్రక్రియ జిల్లాలో దాదాపు ముగిసింది. అయితే ప్రజాపాలన, గ్రామ సభ దరఖాస్తులు సివిల్ సప్లయ్​ కమిషనర్​ లాగిన్​కు (సీసీఎస్​) అప్​లోడ్ అయ్యాయి. ఫీల్డ్​ రిపోర్ట్​ డీఎస్​వోకు సంబంధం లేకుండా డైరెక్ట్​గా సీసీఎస్​కు ఆన్​లైన్​లో వెళ్తుంది. ఇలా రెండు లాగిన్​లలో ఉన్న రిపోర్ట్​లు ఫిల్టర్ చేసి ఫైనల్ లిస్ట్​ రిలీజ్ చేసేందుకు జిల్లాయంత్రాంగం కసరత్తును ముమ్మరం చేసింది.