V6 News

రేషన్ షాపులు లైసెన్స్ తీసుకోవాల్సిందే.. లోక్‌సభలో ఎంపీ కడియం కావ్య ప్రశ్నకు కేంద్రం రిప్లై

రేషన్ షాపులు లైసెన్స్ తీసుకోవాల్సిందే.. లోక్‌సభలో ఎంపీ కడియం కావ్య ప్రశ్నకు కేంద్రం రిప్లై

న్యూఢిల్లీ, వెలుగు: ఫుడ్‌‌‌‌ సేఫ్టీ చట్టం–2006 ప్రకారం రేషన్‌‌‌‌ షాపులు కూడా ఆహార వ్యాపార కార్యకలాపాల పరిధిలోకే వస్తాయని, అర్హతను బట్టి ప్రతి షాపు యజమాని రిజిస్ట్రేషన్‌‌‌‌ లేదా లైసెన్స్‌‌‌‌ తీసుకోవాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. బుధవారం లోక్ సభలో ఎంపీ డాక్టర్‌‌‌‌ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బి.ఎల్‌‌‌‌. వర్మ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. రేషన్‌‌‌‌ షాపులు నడపాలంటే భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఏఐ) లైసెన్స్‌‌‌‌ తప్పనిసరి అని తేల్చి చెప్పారు. 

ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. రేషన్‌‌‌‌ షాపుల్లో పరిశుభ్రత పాటించాల్సిందేనని, ఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఏఐ అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు, శాంపిల్స్‌‌‌‌ సేకరిస్తారని, నాణ్యత లోపిస్తే ఫుడ్‌‌‌‌ బిజినెస్‌‌‌‌ ఆపరేటర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా 38 రకాల నిత్యావసర ఆహార వస్తువుల ధరలను 575 కేంద్రాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని వివరించారు. మొబైల్‌‌‌‌ యాప్‌‌‌‌ ద్వారా ఈ సమాచారాన్ని సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు.