చందానగర్, వెలుగు: ఐటీ ఉద్యోగులే లక్ష్యంగా మహరాష్ర్ట నుంచి హైదరాబాద్‌కు ఎండీఎంఏ డ్రగ్స్, గంజాయి తీసుకొచ్చి అమ్ముతున్న వ్యక్తిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం సాయంత్రం మణికొండలోని ఆంధ్రబ్యాంక్ వద్ద డ్రగ్స్ అమ్ముతున్నారనే సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు అనుమానాస్పదంగా బ్యాగులతో సంచరిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఎండిన పువ్వులు, పండ్లతో కూడిన గంజాయిని, జిప్‌లాక్ కవర్లలో ఎండీఎంఏను గుర్తించారు.
మహరాష్ట్ర నాందేడ్ జిల్లా కిన్వాట్ గ్రామానికి చెందిన సోహెల్ లతీఫ్ ఖాన్(29) ర్యాపిడో డ్రైవర్‌గా పనిచేసి.. వచ్చే డబ్బులు చాలకపోవడంతో డ్రగ్స్ సప్లయర్‌గా మారాడు. ఈయనతో పాటు డ్రగ్స్ కొనేందుకు వచ్చిన ఆర్యన్ దీప్ సింగ్(24), మన్రాజ్సింగ్(26), శుభమ్ ఆనంద్(29), రాబిన్‌సింగ్(24), అజయ్‌కుమార్ సాహో(28)ను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. 3.1 గ్రాముల ఎండీఎంఏ, 17.2 కేజీల గంజాయి, రూ. 20 వేలు, 6 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
