- ఇండ్ల నిర్మాణదారులకు ఊరట
- కామారెడ్డి జిల్లాలో 1,327 మందికి రూ.17 కోట్ల రుణాలు
కామారెడ్డి, వెలుగు : పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోంది. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు కేటాయించి దశల వారీగా బిల్లులు మంజూరు చేస్తోంది. ఆర్థిక ఇబ్బందులతో పనులు ప్రారంభించని పేదలకు చేయూతనందించాలని నిర్ణయించింది. ఐకేపీ సంఘాల ద్వారా బ్యాంకు లోన్లు ఇప్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. బిల్లు వచ్చాక తిరిగి లోన్ చేల్లించేలా లబ్ధిదారులకు అధికారులు అవగాహన కల్పించారు.
దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పేదలు మహిళా సంఘాల ద్వారా లోన్లు తీసుకుని ఇండ్ల నిర్మాణాలను స్పీడప్ చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 1,327 మంది లబ్ధిదారులకు రూ.17 కోట్లు 22 లక్షల మేరకు లోన్లు మంజూరయ్యాయి. ఒక్కో లబ్ధిదారుడికి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు లోన్లు ఇప్పించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఇంటి నిర్మాణానికి ఇసుక, మొరం ఉచితంగా అందజేస్తుండడంతో లబ్ధిదారులకు మరింత ఊరట లభిస్తోంది.
ఈ మేరకు మంజూరైన ప్రతి ఇంటికి మార్కవుట్ చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఎంపీడీవోలకు ఆదేశాలు జారీ చేశారు. నిరంతరం రివ్యూ మీటింగ్‌లు నిర్వహిస్తూ, క్షేత్ర స్థాయిలో నిర్మాణాలను పరిశీలిస్తున్నారు. శాబ్ధిపూర్ గ్రామంలో ఇటీవల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను కలెక్టర్పరిశీలించారు. ఇండ్ల నిర్మాణాల్లో జాప్యం చేయొద్దని, ఏమైనా సమస్యలు ఉంటే తెలుపాలని అధికారులు, లబ్ధిదారులకు సూచించారు.
జిల్లాలో పరిస్థితి ..
జిల్లాలో మొత్తం 11, 616 ఇండ్లు మంజూరయ్యాయి. ఇందులో 6,500 ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. వీటి నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. మంజూరైన లబ్ధిదారుల్లో 10,337 మంది మహిళా సమాఖ్యల్లో సభ్యులుగా ఉన్నారు. లోన్ కావాలని అడిగిన ప్రతి సభ్యురాలికి ఇంటి నిర్మాణ లోన్ బ్యాంక్ లింకేజీ ద్వారా మంజూరు చేస్తున్నారు. ఈ అమౌంట్ విడతల వారీగా చెల్లించవచ్చు. ఇప్పటి వరకు 1,327 మంది లోన్‌కు ఆసక్తి చూపగా వీరికి రూ. 17 కోట్ల 22 లక్షల లోన్ ఇచ్చారు. ఆసక్తి ఉన్న మిగతా వారికి కూడా లోన్ ఇప్పిస్తారు. ఈ పరిస్థితులో ఇండ్ల నిర్మాణ పనుల్లో స్పీడ్ అందుకుంది. అత్యధికంగా ఎల్లారెడ్డి నియోజక వర్గంలో లోన్ తీసుకోగా ఆ తర్వాత కామారెడ్డి నియోజక వర్గం ఉంది.
లోన్లతో లబ్ధిదారులకు మేలు
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మహిళా సమాఖ్యల ద్వారా ఇస్తున్న బ్యాంక్ లింకేజీ లోన్లతో ఎంతో మేలు చేకూరుతుంది. ఇంటి నిర్మాణానికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. లోన్ తీసుకొవటానికి ఆసక్తి ఉన్న వారికి వెంటనే ఇప్పిస్తున్నాం. ఎప్పటికప్పుడు ఐకేపీ అధికారులు లబ్ధిదారులతో మాట్లాడుతున్నాం. –సురేందర్, డీఆర్డీవో- కామారెడ్డి
