ఎఫ్‌సీఐ బియ్యం ఎటు పోయింది?

ఎఫ్‌సీఐ బియ్యం ఎటు పోయింది?

సీబీఐతో విచారణ జరిపించాలని కేంద్రానికి రేవంత్ లేఖ 
హైదరాబాద్, వెలుగు: ఎఫ్‌సీఐ నుంచి మిల్లర్లకు ఇవ్వాల్సిన బియ్యం ఎటు పోయిందో సీబీఐతో విచారణ జరిపించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, సీబీఐ డైరెక్టర్లకు ఆయన బహిరంగ లేఖ రాశారు. ఎఫ్‌సీఐకి మిల్లర్లు ఇవ్వాల్సిన బియ్యం నల్ల బజారుకు తరలించారా..? లేదా విదేశాలకు అమ్ముకున్నారా..? అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్న విషయాన్ని కూడా లేఖలో ప్రస్తావించారు. రైస్‌ మిల్లర్లు ఎఫ్‌సీఐ నుంచి ధాన్యం తీసుకొని బియ్యం తిరిగి ఇవ్వలేదని కిషన్‌ రెడ్డి లెక్కలతో సహా చెప్పారన్నారు. ఆయన అనుమానాలు నిజమేనని అనిపిస్తున్నాయని, అందుకే వెంటనే విచారణకు ఆదేశించి దోషులకు శిక్ష పడేలా చేయాలని కోరారు. తెలంగాణలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 35 శాతం నుంచి 40 శాతం మంది రైతులు మిల్లర్ల దోపిడీకి గురయ్యారని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు విషయంలో స్పష్టత లేక దళారులు, మిల్లర్లకు రైతులు తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోయారన్నారు. తెలంగాణ సర్కారు వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రేవంత్‌ లేఖలో డిమాండ్‌ చేశారు.