అందంగా కనిపించాలనే ఉద్దేశంతో లేజర్ హెయిర్ రిమూవల్ చేయించుకున్న ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది. ఈ లేజర్ హెయిర్ రిమూవల్ తర్వాత ఆమె ముఖంపై కాలిన గాయాలు, వాపు, చర్మం నల్లబడటం వంటి సమస్యలు వచ్చాయి. దీంతో ఆమె వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించింది. కేసును విచారించిన బెంగళూరు వినియోగదారుల కమిషన్.. బాధిత యువతికి పరిహారం చెల్లించాలని బ్యూటీ పార్లర్ క్లినిక్‌ను ఆదేశించింది.
రూ.1,100 చికిత్సతో మొదలైన సమస్య
సమాచారం ప్రకారం.. బాధిత యువతి ఏప్రిల్ 22న తన పై పెదవి, గడ్డం భాగాల్లో వెంట్రుకలను తొలగించుకునేందుకు బ్యూటీ పార్లర్ క్లినిక్‌లో లేజర్ హెయిర్ రిమూవల్ చేయించుకుంది. ఇందుకు రూ.1,100 ఖర్చు చేసింది. అయితే, చికిత్స సమయంలో తనకు తీవ్రమైన మంటగా అనిపించిన.. బ్యూటీషియన్ అలాగే కొనసాగించారని ఆమె ఆరోపించింది. చికిత్సకు ముందు తన చర్మ పరిస్థితిని పరిశీలించలేదని, సేన్సిటివిటి టెస్ట్ కూడా నిర్వహించలేదని ఫిర్యాదులో పేర్కొంది.
ముఖంపై కాలిన గాయాలు..
లేజర్ హెయిర్ రిమూవల్ తర్వాత యువతి ముఖంపై వాపు, చర్మం నల్లబడటం, పై పెదవి, గడ్డం భాగాల్లో పుండ్లు ఏర్పడ్డాయని తెలిపింది. తన ఫిర్యాదులో వీటిని సెకండ్ లెవెల్ కాలిన గాయాలుగా పేర్కొంది. ఈ గాయాల కారణంగా తీవ్రంగా ఇబ్బందిపడ్డానని, ఇతరుల ముందు కనిపించడానికి కూడా ఇబ్బందిగా అనిపించిందని తెలిపింది. నా ఆత్మవిశ్వాసం దెబ్బతినడంతో పాటు వృత్తి జీవితంపైనా ప్రభావం పడిందని ఆరోపించింది.
తనకు జరిగిన నష్టానికి పరిహారం ఇవ్వాలని కోరుతూ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించింది. చికిత్సకు చెల్లించిన రూ.1,100 తిరిగి ఇవ్వడంతో పాటు, శారీరక గాయాలు, మానసిక వేదనకు రూ.3 లక్షలు, కేసు ఖర్చుల కోసం రూ.25,000 చెల్లించాలని కోరింది.
ఈ ఆరోపణలను బ్యూటీ క్లినిక్ ఖండించింది. అయితే, కేసులో ఇచ్చిన ఫొటోలు, వైద్య ప్రిస్క్రిప్షన్ సహా ఇతర రికార్డులను కమిషన్ పరిశీలించింది. క్లినిక్ వాదనకు సంబంధించిన నిర్ణీత గడువు దాటిన తర్వాత దాఖలు చేయడంతో, దాన్ని తిరస్కరించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
చికిత్స అందించే నిపుణులు తగిన స్కిల్స్, అనుభవంతో పాటు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కమిషన్ స్పష్టం చేసింది. చర్మంపై నేరుగా చేసే సౌందర్య చికిత్సలకు ముందు కస్టమర్ చర్మ పరిస్థితి, అలర్జీలు, గతంలో ఎదురైన ప్రతిచర్యలు వంటి వివరాలను తెలుసుకోవాలని పేర్కొంది. అలాగే, చికిత్స వల్ల కలిగే ప్రమాదాలను వివరించి, అవసరమైన పరీక్ష నిర్వహించిన తర్వాతే ట్రీట్మెంట్ ప్రారంభించాలని సూచించింది.
యువతికి పరిహారం
క్లినిక్ సేవల్లో లోపం ఉందని, ఇది అన్యాయమైన వ్యాపార పద్ధతి కిందకు వస్తుందని కమిషన్ నిర్ధారించింది. బాధిత యువతికి చర్మానికి జరిగిన నష్టం, మానసిక వేదనకు పరిహారంగా రూ.1,00,000, కేసు ఖర్చుల కోసం రూ.10,000, చికిత్స కోసం చెల్లించిన డబ్బు రూ.1,100 తిరిగి ఇవ్వాలని ఆదేశించింది.
మొత్తంగా రూ.1,11,100 చెల్లించాలని, దీనికి అదనంగా వర్తించే వడ్డీ కూడా ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది. ఈ మొత్తాన్ని 45 రోజుల్లో ఇవ్వాలని... పరిహారం, కేసు ఖర్చులకు సంబంధించిన రూ.1.10 లక్షలపై ఏడాదికి 9 శాతం వడ్డీ వర్తిస్తుందని తెలిపింది.
