- 2.17 లక్షల రైతులకు క్వింటాల్‌కు రూ.500 చొప్పున చెల్లింపు
- మొత్తం 4.64 లక్షల రైతుల ఖాతాల్లో రూ.1,939.58 కోట్లు జమ
హైదరాబాద్, వెలుగు: రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సన్న వడ్లకు సంబంధించిన బోనస్ నిధులను సోమవారం విడుదల చేసింది. దీంతో పెండింగ్‌లో ఉన్న రూ.514.36 కోట్ల బోనస్ నిధులు రిలీజ్ అయ్యాయి. ఈ నిధులతో 2.17 లక్షల రైతులకు ప్రయోజనం చేకూరనుంది. సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ చెల్లించనున్నారు. వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చడం, సన్న వడ్ల సాగును ప్రోత్సహించడానికి ప్రభుత్వం క్వింటాల్‌పై రూ.500 బోనస్ ఇస్తున్న సంగతి తెలిసిందే. కనీస మద్దతు ధర రూ.2,389 ఉండగా దీనికి రూ.500 కలిపి ఇస్తున్నారు.
71.85 లక్షల టన్నుల ధాన్యం సేకరణ
2025–26 వానాకాలం సీజన్‌లో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో 71.85 లక్షల టన్నుల ధాన్యం సేకరించి ఆల్‌టైం రికార్డు సృష్టించింది.రాష్ట్రంలో అక్టోబర్ 1 నుంచి 8,448 సెంటర్లు ఓపెన్‌చేసి సివిల్సప్లైస్అధికారులు వడ్ల కొనుగోళ్లు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 39.14లక్షల టన్నుల సన్నవడ్లు, మరో 32.71 లక్షల టన్నులు దొడ్డు వడ్లు కొనుగోలు చేశారు. సన్న వడ్లకు క్వింటాల్ కు రూ.500 చొప్పున బోనస్ రూపంలో ప్రభుత్వం రూ.1,425.22 కోట్లు అదనంగా ఇప్పటికే చెల్లించగా, తాజాగా మరో రూ.514.36 కోట్లు విడుదల చేసింది. దీంతో ఈ సారి వానాకాలం సన్న వడ్ల బోనస్మొత్తం రూ.1,939.58 కోట్లు చెల్లించినట్లయింది. ఫలితంగా దాదాపు 4.64 లక్షల మంది రైతులకు బోనస్ ద్వారా ప్రయోజనం చేకూరింది. ఇలా వానాకాలం సీజన్లో 14.25 లక్షల మంది రైతుల నుంచి మద్దతు ధరతో సేకరించినఈ వడ్ల విలువ బోనస్ తో కలిపి రూ.19,019.36 వేల కోట్లుగా ఉంది.
