ఆర్టీసీలో డిసిప్లినరీ యాక్షన్ కింద జాబ్ కోల్పోయిన వారికి తిరిగి ఉద్యోగాలు

ఆర్టీసీలో డిసిప్లినరీ యాక్షన్ కింద  జాబ్ కోల్పోయిన వారికి తిరిగి ఉద్యోగాలు
  •  ఆర్టీసీ యూనియన్ల హర్షం

హైదరాబాద్, వెలుగు: గతంలో చిన్న, చిన్న తప్పులు  చేసి, క్రమశిక్షణ ఉల్లంఘించారనే కారణాలతో జాబ్​ నుంచి తీసేసిన పలువురు డ్రైవర్లు, కండక్టర్లకు, శ్రామిక్ లకు తిరిగి ఉద్యోగాలు ఇవ్వాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ నిర్ణయంపై ఆర్టీసీ యూనియన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. మొదటి విడతలో సోమవారం ఎనిమిది మందికి తిరిగి ఉద్యోగాలు ఇచ్చారు. ఇందులో ఐదుగురు కండక్టర్లు, ఇద్దరు డ్రైవర్లు, ఒకరు శ్రామిక్ ఉన్నారు. విడతల వారీగా మరి కొందరిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోనున్నారు. డిసిప్లినరీ యాక్షన్ ​కింది మేనేజ్​మెంట్​ఇప్పటి వరకు సుమారు 400 మందిని తొలగించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చని తర్వాత దీనిపై ఓ కమిటీ వేసి, గతంలో మంచి ట్రాక్ రికార్డు ఉన్న వారిని గుర్తించి, తప్పులను క్షమించాలని యాజమాన్యం భావించింది. 

ఇందులో భాగంగానే మొదటి విడతలో ఎనిమిది మందికి తిరిగి ఉద్యోగాలు ఇచ్చింది. అయితే మళ్లీ ఉద్యోగం పొందిన వారికి మాత్రం పాత సీనియార్టీ ఉండదు. కొత్తగా ఉద్యోగంలో చేరినట్లుగానే యాజమాన్యం గుర్తిస్తున్నది. మరోవైపు యాజమాన్యం చిన్న, చిన్న తప్పులు చేసిన వారిని క్షమించి తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నందుకు ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్ బాబు, ఈదురు వెంకన్న మేనేజ్​మెంటుకు థ్యాంక్స్ చెప్పారు. ఆగస్టు 15 లోపు మిగితా వారిని తీసుకోవాలని కోరారు.