లోకల్ జాతర్లకు సిద్ధమైన మేడారం వెళ్లలేని భక్తులు

 లోకల్ జాతర్లకు సిద్ధమైన మేడారం వెళ్లలేని భక్తులు
  • జిల్లాల్లో సమ్మక్క సారలమ్మ జాతరల సందడి
  • లక్షలాదిగా తరలిరానున్న భక్తులు
  • ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

హనుమకొండ, వెలుగు: ఓ వైపు మేడారం మహాజాతరకు సమయం ఆసన్నమవగా, మరోవైపు మినీ మేడారాల సందడి మొదలైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ చోట్ల సమ్మక్క, సారలమ్మ జాతర్లు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అంతా సిద్ధం చేసింది. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లతో పాటు తాగునీరు, టాయిలెట్స్ సదుపాయం కల్పించారు. హనుమకొండ, వరంగల్ బస్టాండ్ల నుంచి స్పెషల్ బస్సులు నడిపిస్తున్నారు.

సిద్ధమైన అగ్రంపహాడ్..

మేడారంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలాచోట్ల సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహిస్తున్నారు. ఇందులో ఒక్క హనుమకొండ జిల్లాలోనే 13కుపైగా చోట్లా జాతర జరుపుతున్నారు. ఇందులో హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని అగ్రంపహాడ్ ప్రధానమైనది. సమ్మక్క పుట్టింది అగ్రంపహాడ్ లోనే అని స్థానికంగా ప్రచారం ఉండగా, మొదటికి వెళ్లలేని భక్తుల్లో చాలామంది ఇక్కడికే వస్తుంటారు. ఇక్కడికి వచ్చే భక్తులు ఏటికేడు పెరుగుతుండటంతో అధికారులు ఏర్పాట్లు చేశారు. 

ఊళ్లల్లో సందడే సందడి..

మేడారం మహాజాతర నేపథ్యంలో ఊళ్లల్లో సందడి నెలకొంది. మేడారం వెళ్లలేని చాలామంది భక్తులు స్థానికంగా నిర్వహిస్తున్న జాతర్లకు రెడీ అవుతున్నారు. భీమదేవరపల్లి మండలం ముల్కనూరు, కమలాపూర్ మండలం కన్నూరు, మర్రిపెల్లిగూడెం, కమలాపూర్, మాధన్నపేట, శాయంపేట మండలం పెద్దకొడేపాక పరిధి జోగంపల్లిలో నిర్వహించే జాతరకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. కాజీపేట మండలం ఉర్సుగుట్ట సమీపంలోని అమ్మవారిపేట, వేలేరు మండలం ఎర్రబెల్లి, హసన్ పర్తి మండలం మడిపెల్లి గ్రామాల్లో కూడా సమ్మక్క, సారలమ్మ జాతర నిర్వహిస్తున్నారు.  

ములకలపల్లిలో..

మొగుళ్లపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ములకలపల్లి–మొగుళ్లపల్లి గ్రామాల మధ్య ఉన్న సమ్మక్క సారలమ్మ ఆలయం వద్ద నేటి నుంచి జాతర ప్రారంభం కానున్నట్లు ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి చదువు అన్నారెడ్డి చెప్పారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. జాతరకు సంబంధించిన ఏర్పాట్లపై తహసీల్దార్ సునీతారెడ్డి, ఎస్సై అశోక్, ఎంపీడీవో సురేందర్ గౌడ్, పీహెచ్​సీ డాక్టర్ నాగరాణితో పాటు పలు శాఖల ఆఫీసర్లు సమీక్ష నిర్వహించారు.

మద్ది మేడారంలో..

నల్లబెల్లి : వరంగల్​ జిల్లా నల్లబెల్లి మండలం నాగరాజుపల్లి సమీపంలో జరిగే సమ్మక్క_ సారలమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం నర్సంపేట ఆర్డీవో ఉమాదేవి, దుగ్గొండి సీఐ సాయిరమణ, నల్లబెల్లి తహసీల్దార్​ కృష్ణ పరిశీలించారు. ఈసారి భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని ట్రస్టు చైర్మన్​ రాజేశ్​ ఆర్డీవోకు చెప్పారు. పూజారి నాగరాజు, సర్పంచ్ రజిత, తిరుపతిరెడ్డి, అధికారులున్నారు.

ఎక్కడికక్కడ ఏర్పాట్లు..

గ్రామాల్లో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర్లకు వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో జాతర నిర్వహణకు ఎక్కడికక్కడ గ్రామాల పరిధిలో ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేశారు. ఆయా కమిటీల ఆధ్వర్యంలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మేడారం తరహాలోనే మినీ జాతరలు జరగనుండగా, స్థానిక జాతర్లతో అంతటా ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తోంది.