జహీరాబాద్, వెలుగు: చిరుధాన్యాలు సాగు చేస్తూ.. విత్తనాలను నిల్వ చేసి వాటిని అందరికీ పరిచయం చేస్తున్న డీడీఎస్ కమ్యూనిటీ విత్తన బ్యాంక్ మాచనూర్ మహిళ సంఘాల సభ్యులు బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేతుల మీదుగా ప్లాంట్ జినోమ్ సేవియర్ అవార్డును అందుకున్నారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని పస్తాపూర్ కేంద్రంగా డీడీఎస్ సుమారు 70 గ్రామాల్లో 40 ఏండ్లుగా మహిళ సంఘాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా పాత పంటల పరిరక్షణకు కృషి చేస్తున్నారు. 80 రకాల పాత పంటల విత్తనాలను నిల్వ చేస్తూ, వాటిని రైతులకు పంపిణీ చేసి వాటి ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తున్నారు. మహిళా సంఘాలు పాత పంటల పరిరక్షణకు చేస్తున్న కృషిని గుర్తించి కేంద్ర వ్యవసాయ శాఖ 2022 సంవత్సరానికి గాను ప్లాంట్ జినోమ్ సేవియర్ అవార్డుకు ఎంపిక చేసింది.
