- కార్తీక మాసం వేళ ఘనంగా సత్యనారాయణస్వామి వ్రతాలు
భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శనివారం మూలవరులకు గర్భగుడిలో సువర్ణ తులసీదళాలతో అర్చన నిర్వహించారు. సుప్రభాత సేవ అనంతరం రామపాదుకలను భద్రుని మండపానికి తీసుకెళ్లి పంచామృతాలతో అభిషేకం చేశారు. వేదమంత్రోచ్ఛరణల మధ్య జరిగిన ఈ అభిషేకంలో భక్తులు పాల్గొనగా వారికి అభిషేక జలాలను పంపిణీ చేశారు. గర్భగుడిలో మూలవరులను ప్రత్యేక అలంకరణ చేసి బంగారు తులసీ దళాలతో అర్చన వేదోక్తంగా జరిపించారు. హారతులు సమర్పించారు. బేడా మండపంలో కల్యాణమూర్తులకు నిత్య కల్యాణం నిర్వహించగా 41 జంటలు కంకణాలు ధరించి క్రతువులో పాల్గొన్నాయి.
విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, సుముహూర్తం, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుక అనంతరం మంత్రపుష్పం సమర్పించడంతో క్రతువు ముగిసింది. కార్తీక మాసం సందర్భంగా చిత్రకూట మండపంలో నిర్వహించిన సత్యనారాయణస్వామి వ్రతాల్లో 42 జంటలు పాల్గొన్నాయి. అర్చకులు వ్రత విశిష్టతను, కథను భక్తులకు వివరించారు. సాయంత్రం దర్బారు సేవ జరిగింది. ఈ ఏడాది అక్టోబరులో 1,89,062 మంది భక్తులు స్వామి దర్శనం చేసుకున్నారు. గతేడాది ఇదే నెలలో 1,45,333 మంది భక్తులు దర్శనానికి వచ్చారు.
