- ఇన్నేండ్ల ఆలస్యంపైనా సుమోటోగా కేసు నమోదు
- యాసిడ్ దాడి నేరస్తులపై కనికరం చూపొద్దని సూచన
- షహీన్ మాలిక్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కామెంట్లు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా యాసిడ్ దాడి కేసుల విచారణలో జరుగుతున్న విపరీతమైన జాప్యంపై సుప్రీం కోర్టు గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 2009లో షహీన్ మాలిక్‌పై జరిగిన యాసిడ్ దాడి కేసు కోర్టుకు రాగా చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చీతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. 16 ఏండ్లయినా ఈ కేసు విచారణ పూర్తికాకపోవడం దేశానికి, న్యాయవ్యవస్థకు అవమానం అంటూ ఫైర్ అయింది.
దేశ రాజధానిలో కూడా ఇలాంటి కేసును త్వరగా తీర్చలేకపోతే ఇంకెవరు పరిష్కరిస్తారని ప్రశ్నించింది. ఇంతటి ఆలస్యంపైనా సుమోటాగా కేసు నమోదు చేస్తున్నట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇలాంటి కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో వేగంగా విచారించాలని, అన్ని హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న యాసిడ్ దాడి కేసుల వివరాలు నాలుగు వారాల్లోగా సమర్పించాలని ఆదేశించింది.
యాసిడ్ దాడి నేరస్థులపై కనికరం చూపొద్దని, ఇలాంటి కేసులలో కోర్టుల వ్యవస్థ మొత్తం కఠినంగా స్పందించాలని సీజేఐ ఆదేశించారు. ‘ఆ దుర్మార్గులు బాధితులపై చూపిన క్రూరత్వానికి అంతే కఠినత్వంతో వ్యవస్థ స్పందించాలి. కోర్టులు సానుభూతి చూపొద్దు’ అని స్పష్టం చేశారు.
వారినీ దివ్యాంగులుగా గుర్తించాలి..
యాసిడ్ దాడికి గురైన షహీన్ మాలిక్ కేసు విచారణ ఢిల్లీలోని రోహిణి కోర్టులో 2009 నుంచి కొనసాగుతోంది. ఈ కేసు విచారణ ఇప్పటివరకు ముగియకపోవడంతో బాధితురాలు సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు. ముఖంపైనే కాకుండా యాసిడ్ తాగించిన కేసులు కూడా పెండింగ్‌లో ఉన్నాయని ఆమె పిల్‌లో పేర్కొన్నారు.
‘సర్’ ప్రక్రియలో సిబ్బందిని పెంచండి.. రాష్ట్రాలకు సుప్రీం ఆదేశం
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) కొనసాగుతున్న రాష్ట్రాల్లో వర్క్ ప్రెజర్ తో జరుగుతున్న బూత్ లెవెల్ ఆఫీసర్ల(బీఎల్‌వో) మరణాలు, ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 10 వేల మంది సిబ్బంది ఉన్నచోట 30 వేల మందిని పెట్టాలని సూచించింది. వర్క్‌లోడ్ తగ్గించాలని, సిబ్బంది మానసిక ఒత్తిడికి గురికాకుండా చూడాలని యూటీలు, రాష్ట్ర ప్రభుత్వాలను చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది.
అనారోగ్యంతో ఉన్న, విధుల నుంచి మినహాయింపు కోరుకునే సిబ్బందికి తప్పనిసరిగా సెలవులు ఇవ్వాలంది. వారి స్థానంలో మరొకరికి విధులు కేటాయించాలని, పని గంటలు తగ్గించాలని సూచించింది. సెలవులు కేటాయించకపోతే బీఎల్‌వోలు కోర్టును ఆశ్రయించాలని చెప్పింది. బీఎల్‌వోలంతా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే కాబట్టి వారి బాగోగుల బాధ్యతలూ రాష్ట్రాలవేనని స్పష్టం చేసింది.
