కర్నాటకలో వ్యాక్సిన్ కేంద్రాలుగా స్కూళ్లు, కాలేజీలు

కర్నాటకలో వ్యాక్సిన్ కేంద్రాలుగా స్కూళ్లు, కాలేజీలు

బెంగళూరు: కరోనా మహమ్మరి స్వైర విహారంతో బెంబేలెత్తుతున్న కర్నాటక ప్రభుత్వం వైరస్ కట్టడి చేసేందుకు వీలు దొరికిన ఏ చిన్న మార్గాన్ని వదలడం లేదు. వ్యాక్సిన్ కేంద్రాల వద్ద జనం భౌతిక దూరం (సోషల్, ఫిజికల్ డిస్టెన్స్) పాటించకపోవడంతో మరింత మంది వైరస్ బారిన పడుతున్నారు. దీంతో వ్యాక్సిన్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు సైతం ఏర్పాటు చేస్తున్నా ఫలితాలు కనిపించడం లేదు. కర్నాటకలో ప్రతిరోజు 40 వేలకు పైగా కేసులు నమోదవుతున్న నేపధ్యంలో లాక్ డౌన్ విధించినా కేసులు యధావిధిగానే నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో వ్యాక్సిన్ కేంద్రాలను సురక్షిత ప్రాంతాల్లో నిర్వహించాలని యోచిస్తున్న సర్కారు చివరకు స్కూల్లు, కాలేజీలకు తరలించాలని సిద్ధమైంది. ప్రస్తుతం ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో ఉన్న వ్యాక్సిన్ కేంద్రాలన్నీ స్కూళ్లు, కాలేజీలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 

రెమ్ డెసివర్ 5 లక్షల డోసులకు గ్లోబల్ టెండర్లు

కరోనా బాధితులను వెంటనే గుర్తించేందుకు పల్స్ ఆక్సీ మీటర్లు అవసరం అని గుర్తించిన కర్నాటక  మరో రెండు లక్షల పల్స్ ఆక్సీ మీటర్లు సేకరించడానికి ప్రయత్నాలు చేస్తోంది. కరోనా పరీక్షల్లో వేగం పెంచేందుకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్ లతోపాటు డీఆర్డీఓ అభివృద్ధి చేసిన 1000 ఆక్సి కేర్ సిస్టమ్స్ ను కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు కర్నాటక ఉప ముఖ్యమంత్రి, టాస్క్ ఫోర్స్ కమిటీ ఛైర్మన్ డాక్టర్ సీఎన్ అశ్వత్ నారాయణ్ వెల్లడించారు. అలాగే 5 లక్షల రెమ్ డెసివర్ వ్యాక్సిన్లను కొనుగోలు చేసేందుకు గ్లోబల్ టెండర్లు పిలవాలని నిర్ణయించామని.. దీనికి 75 కోట్ల బడ్జెట్ కూడా కేటాయించడం పూర్తయిందని ఆయన తెలిపారు.