ఒక్క వ్యాక్సిన్‌తో కరోనా వేరియంట్‌‌ల ఖేల్‌ఖతం

ఒక్క వ్యాక్సిన్‌తో కరోనా వేరియంట్‌‌ల ఖేల్‌ఖతం

కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గింది. అయితే మూడో వేవ్ ముప్పు పొంచి ఉందని, జాగ్రత్తలు పాటించాల్సిందేనని నిపుణులు సూచిస్తున్నారు. ఇదే తరుణంలో డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్‌‌లు ఆందోళనను కలిగిస్తున్నాయి. ఈ రకం వేరియంట్‌‌లు ఇప్పటికే చాలా దేశాల్లో వ్యాపించాయని తెలుస్తోంది. కరోనాను తరిమికొట్టకుండా డెల్టా వేరియంట్ తమను అడ్డుకుంటోందని అమెరికా వైద్య నిపుణుడు, వైట్ హౌస్ చీఫ్ మెడికల్ అడ్వయిజర్ ఫౌసీ అనడం గమనార్హం. ఈ నేపథ్యంలో సైంటిస్టులు కొత్త పరిశోధనలకు శ్రీకారం చుట్టారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన అన్ని కరోనా వేరియంట్‌లను తట్టుకునేలా సార్వత్రిక టీకాను రూపొందించే పనిలో పడ్డారు. 

యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా సైంటిస్టులు యూనివర్సల్ టీకాను తయారు చేసే పనుల్లో బిజీగా ఉన్నారు. వీళ్లు ఓ హైబ్రిడ్ వ్యాక్సిన్‌ను రూపొందించారు. సూపర్ వ్యాక్సిన్‌గా పిలుస్తున్న ఈ టీకా.. భవిష్యత్‌లో వచ్చే కరోనా వేరియంట్‌ల నుంచి కూడా రక్షణను అందిస్తుందని సమాచారం. ఈ వ్యాక్సిన్‌ను ఎలుకలపై ప్రయోగించగా సక్సెస్ అయ్యామని సైంటిస్టులు తెలిపారు. ఈ టీకా ఎలుకల్లో ప్రవేశపెట్టిన కరోనా వైరస్‌ను ప్రభావవంతంగా అడ్డుకోవడమే కాకుండా ఊపిరితిత్తులకూ రక్షణ కల్పించిందని చెప్పారు. కరోనా కుటుంబం నుంచి ఏ రకం వైరస్ వచ్చినా సమర్థంగా అడ్డుకునేందుకు వ్యాక్సిన్ తయారీపై దృష్టి సారించామన్నారు. మరింత అధ్యయనం తర్వాత వచ్చే ఏడాది మనుషులపై ప్రయోగాలకు రెడీ అవుతున్నామని పేర్కొన్నారు.