
సికింద్రాబాద్ జ్యుయలరీ షాపు దోపీడీ కేసును పోలీసులు ఛేదించారు. ఐటీ అధికారుల పేరుతో సికింద్రాబాద్లోని జ్యుయలరీ షాపులో దాదాపు రెండు కిలోల బంగారం దోచుకున్న ముఠాను హైద్రాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని థానేలో జకీర్, రహీమ్, ప్రవీణ్, అక్షయ్ లను అదుపులోకి తీసుకున్నారు. వీరికి సహకరించిన హైదరాబాద్ కు చెందిన మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి చోరీ చేసిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
సికింద్రాబాద్ మోండా మార్కెట్లో మే 27వ తేదీన మధ్యాహ్నం భారీ చోరీ జరిగింది. ఐటీ అధికారులమంటూ వచ్చిన కొందరు దుండగులు.. హర్ష జ్యువెలరీ దుకాణంలో 1700 గ్రాముల బంగారం దోచుకుని పరారయ్యారు. శనివారం ఐదుగురు మోండా మార్కెట్లోనిహర్ష జ్యువెలరీ దుకాణానికి వచ్చారు. బంగారం కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడుతున్నారంటూ మూడో అంతస్తులో ఉన్న దుకాణం యజమాని వద్దకు వెళ్లి బెదిరించారు. దుకాణంలో ఉన్న బంగారం మొత్తం తనిఖీ చేయాలంటూ సిబ్బందిని పక్కన కూర్చోబెట్టారు. ఇక షాపులో 1700 గ్రాముల బంగారానికి సంబంధించిన ఎలాంటి పన్ను చెల్లించలేదని ..దాన్ని స్వాధీనం చేసుకుని పరారయ్యారు.
నోటీసులు ఇవ్వకుండానే..
దుకాణ యజమాని ఆ ప్రాంతంలో ఉన్న మిగితా జ్యువెలరీ దుకాణాల యజమానులకు ఐటీ అధికారులు వచ్చి బంగారం తీసుకెళ్లారన్న విషయాన్ని వివరించాడు. అయితే ఐటీ అధికారులు ఇష్టం వచ్చి తనిఖీలు చేయరని..ముందుగా నోటీసులు ఇస్తారని చెప్పడంతో అవాక్కైన యజమాని.... పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ చోరీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుల కోసం 5 ప్రత్యేక బృందాలతో పాటు టాస్క్ఫోర్స్ పోలీసులు కూడా గాలించారు. నిందితులు మహారాష్ట్ర థానేకు చెందిన గ్యాంగ్‌గా పోలీసులు తేల్చారు. వారిని పట్టుకునేందుకు కొన్ని బృందాలు మహారాష్ట్రకు వెళ్లాయి. అయితే అంతకముందు నిందితులు చోరీ తర్వాత ఆటోలో జేబీఎస్ వెళ్లినట్లు సీసీ టీవీలో రికార్డయింది. అక్కడి నుంచి ఈ ముఠా కూకట్‌పల్లి, పటాన్‌చెరు మీదుగా మహారాష్ట్ర వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. మహరాష్ట్ర పోలీసుల సహకారంతో హైద్రాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో నలుగురి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.