పీహెచ్‌‌సీల్లేవ్.. కిలోమీటర్లు పోతేనే దవాఖాన

 పీహెచ్‌‌సీల్లేవ్.. కిలోమీటర్లు పోతేనే దవాఖాన
  • కొన్ని చోట్ల 20, 30 కిలోమీటర్లు పోతేనే దవాఖాన
  •  ఎమర్జెన్సీలో పానాలు పోగొట్టుకుంటున్న ప్రజలు   
  •  ఏడేండ్లయినా అమలు కాని ‘మండలానికో పీహెచ్‌‌సీ’ హామీ  
  •  ‘పీహెచ్‌‌సీకి నలుగురు డాక్టర్లు’ కూడా ఉత్త ముచ్చట్నే

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఊరికో వైన్ షాపు వస్తోందే తప్ప, ప్రభుత్వ దవాఖాన్ల సంఖ్య మాత్రం పెరగడం లేదు. ప్రతి మండలంలో 30 బెడ్ల ప్రైమరీ హెల్త్ సెంటర్ (పీహెచ్‌‌సీ)ను ఏర్పాటు చేస్తామన్న సీఎం కేసీఆర్ హామీకి ఏడున్నర ఏండ్లు అవుతున్నా అమలుకాలేదు. ఇప్పటికీ రాష్ట్రంలోని 46 మండలాల్లో ఒక్క ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా లేదు. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కనీసం ప్రాథమిక చికిత్సకు కూడా నోచుకోక ఆయా మండలాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పాము కాట్లు, ఆత్మహత్యల వంటి సందర్భాల్లో మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గర్భిణులు ప్రతి నెలా చెకప్‌‌ల కోసం పాతిక, ముప్పై కిలోమీటర్లు ప్రయాణించి ఇతర మండలాల్లోని దవాఖాన్లకు వెళ్లాల్సి వస్తోందని చెబుతున్నారు. పల్లెల్లోనూ కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందిస్తామని చెప్పడమే తప్ప, ఇప్పటికీ జనాలకు ఆర్‌‌‌‌ఎంపీ వైద్యమే దిక్కు అవుతోంది. పీహెచ్‌‌సీలు లేని మండలాల్లో ఏ రోగానికైనా ఆర్‌‌‌‌ఎంపీలు తప్ప మరో ఆప్షన్ ఉండడం లేదు. 

మరో 532 పీహెచ్‌‌సీలు కావాలె..    
రాష్ట్ర జనాభాకు అనుగుణంగా ప్రైమరీ హెల్త్ సెంటర్ల సంఖ్య లేదు. 2012 నాటి ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్‌‌(ఐపీహెచ్‌‌ఎస్‌‌) రిపోర్టు ప్రకారం ట్రైబల్ ఏరియాల్లో ప్రతి 20 వేల జనాభాకు ఒక పీహెచ్‌‌సీ, మైదాన ప్రాంతాల్లో ప్రతి 30 వేల జనాభాకు ఒక పీహెచ్‌‌సీ ఉండాలి. ఈ లెక్కన మన రాష్ట్రంలో కనీసం 1400 పీహెచ్‌‌సీలు ఉండాలి. కానీ 868 మాత్రమే ఉన్నాయి. ఇందులో 232 సెంటర్లు అర్బన్‌‌ ఏరియాల్లోనే ఉన్నాయి. కొన్ని చోట్ల అర్బన్ ప్రైమరీ సెంటర్లను, జిల్లా హాస్పిటళ్లు, ఏరియా హాస్పిటళ్లలో కలిపేశారు. ఎక్కువగా చూపించడానికే తప్ప, ఇవి వైద్యానికి పనికి రాకుండా ఉన్నాయి. మరోవైపు మొత్తం 868 సెంటర్లలో 1,350 మంది డాక్టర్లు మాత్రమే ఉన్నారు. సీఎం కేసీఆర్ చెప్పినట్టు ఒక్కో పీహెచ్‌‌సీకి నలుగురు డాక్టర్లు ఉండాల్నంటే, ఇంకో 2,200 మంది డాక్టర్లను నియమించాల్సి ఉంటుంది.  

400 పీహెచ్‌‌సీలు సాయంత్రమే క్లోజ్ 
ప్రతి పీహెచ్‌‌సీలో నలుగురు డాక్టర్లను నియమిస్తామని, 24 గంటలు పీహెచ్‌‌సీలో డాక్టర్లు ఉండేలా చూస్తామని సీఎం కేసీఆర్ అనేకసార్లు చెప్పారు. కానీ, ఇప్పటికీ రాష్ట్రంలోని సగం మండలాల్లో కూడా 24 గంటలు నడిచే పీహెచ్‌‌సీలు లేవు. గ్రామీణ ప్రాంతాల్లో 636 పీహెచ్‌‌సీలు ఉంటే, అందులో 230 మాత్రమే 24 గంటలు నడుస్తున్నాయి. మిగిలినవన్నీ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకే ఓపెన్ ఉంటున్నాయి. ఇప్పుడు డయాబెటిస్, బీపీ, కిడ్నీ జబ్బులు, గుండెపోటు, ఇతర నాన్‌‌ కమ్యూనికెబుల్ వ్యాధులు గ్రామాల్లోనూ చాలా మందికి వస్తున్నాయి. దీంతో పల్లెల్లోనూ ఎమర్జెన్సీ కేసులు పెరిగాయి. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ప్రైవేటు హాస్పిటళ్లు 24 గంటలు డాక్టర్లను అందుబాటులో ఉంచుతున్నాయి. పేదలకు వైద్యం అందించాల్సిన ప్రభుత్వ దవాఖాన్లు మాత్రం సాయంత్రమే మూతపడుతున్నాయి.

కొత్త మండలాలకే రాలే..
పీహెచ్‌‌సీలు లేని 46 మండలాల్లో ఎక్కువగా కొత్తగా ఏర్పడినవే ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 5 మండలాల్లో, కామారెడ్డి జిల్లాలో 4 మండలాల్లో పీహెచ్‌‌సీలు లేవు. జగిత్యాల, గద్వాల, మహబూబాబాద్, సిరిసిల్ల, సూర్యాపేట జిల్లాల్లో మూడేసి మండలాల్లో, ఆదిలాబాద్, జనగాం, మంచిర్యాల, మెదక్, నాగర్‌‌‌‌కర్నూల్, నల్గొండ, సంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో రెండేసి మండలాల్లో, భూపాలపల్లి, కరీంనగర్‌‌, ఆసిఫాబాద్‌‌, నారాయణపేట్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో ఒక్కో మండలంలో పీహెచ్‌‌సీలు లేవు. కొత్తగా ఏర్పాటు చేయబోతున్న పల్లె దవాఖాన్ల కేటాయింపులోనైనా తమ మండలాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.

దవాఖానకు పోయేలోపే డెలివరీ   
దగ్గర్లో దవాఖాన లేక ఎమర్జెన్సీ సమయంలో ప్రాణాలు పోయే పరిస్థితులు ఏర్పడుతున్నయి. మా దగ్గర్నుంచి 30 కిలోమీటర్లు పోతేనే దవాఖాన ఉంది. ముఖ్యంగా గర్భిణు లు పక్క మండలాలకు పోయి చూపించుకోవాల్సి  వస్తోంది. రెండు నెలల క్రితం ఓ మహిళ నెలలు నిండి మార్గమధ్యంలోనే అనేక అవస్థల మధ్య ఓ బిడ్డకు జన్మనిచ్చింది. స్థానికంగా పీహెచ్ సీ లేకపోవడం వల్లే తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చౌటకూర్ మండలంలో పీహెచ్‌‌సీ ఏర్పాటు చేయాలి. 
- శేఖర్ గౌడ్, చౌటకూర్‌‌‌‌ మండలం 

25 కిలోమీటర్లు పోవాలె 
మా మండలంలో గవర్నమెంట్ దవాఖాన లేదు. ఏ రోగమొచ్చినా పాతిక కిలోమీటర్ల దూరంలోని మేళ్లచెరువు దవాఖానకు పోయి చూపించుకోవాలె. మా ఊరికి రోడ్ సరిగా లేదు, బస్సులు కూడా రావు. ఏ టైమ్‌‌లో ఏ ఇబ్బంది వస్తదో తెలియదు. ప్రెగ్నెంట్ గా ఉన్న నాలాంటోళ్లు అక్కడికెళ్లి చూపించుకోవాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తోంది. 
- బయ్యారపు నాగమణి, వజినేపల్లి, చింతలపాలెం మండలం, సూర్యాపేట జిల్లా పానాల మీదికి వస్తోంది. 


మా దగ్గర్నుంచి 30 కిలో మీటర్ల వరకూ ప్రభుత్వ దవాఖానలేదు. అంతదూరం వెళ్లలేక ప్రైవేటు హాస్పిటళ్లకు పోవాల్సి వస్తోంది. జ్వరానికి కూడా వేల రూపాయల బిల్లులు కట్టుకోక తప్పుతలేదు. యాక్సిడెంట్లు, సూసైడ్లు వంటి సీరియస్ కేసుల్లో ఇతర ప్రాంతాల్లోని దవాఖానకు తరలిస్తున్నారు. అక్కడికి చేరేలోగా పరిస్థితి పానాల మీదకి వస్తోంది. 
- పోలేపల్లి రజినీకాంత్ రెడ్డి, నర్సింహులపేట, మహబూబాబాద్ జిల్లా