
- సిల్ట్‌ను తీసే రెండు మిషన్లను ఎల్‌ఎండీలోకి దింపిన కాంట్రాక్ట్ కంపెనీ
- 1.31 కోట్ల టన్నుల పూడిక తీసేందుకు సన్నాహాలు
- త్వరలోనే అధికారికంగా పనులు ప్రారంభం
- పని పూర్తవ్వడానికి 20 ఏళ్లు పడుతుందని అంచనా
కరీంనగర్, వెలుగు: లోయర్ మానేరు డ్యామ్ లో సిల్ట్ తొలగించేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. నీరు ఉండగానే ఎల్‌ఎండీ నుంచి ఇసుక, బురద తీసే రెండు మిషన్లను కాంట్రాక్ట్ కంపెనీ రిజర్వాయర్‌కు తరలించింది. రాష్ట్రంలోని ప్రధాన రిజర్వాయర్లలో నిండిపోయిన బురదను తొలగించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. తొలుత పైలట్ ప్రాజెక్టుగా లోయర్ మానేరుతోపాటు మిడ్ మానేరు, నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టును ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే కరీంనగర్ ఎల్ఎండీలో సిల్ట్ తొలగించే పనిని ముంబైకి చెందిన కంపెనీ కాంట్రాక్టు దక్కించుకుంది.
సిల్ట్ తొలగింపులో భాగంగా తరలించిన ఇసుక, మట్టిని డంప్ చేసేందుకు తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి వద్ద సివిల్ పనులను సదరు కంపెనీ ఇటీవల ప్రారంభించింది. అలాగే సిల్ట్‌ను తొలగించే రెండు మిషన్లను కొత్తపల్లి శివారులోని ఎల్ఎండీలో మోయతుమ్మెద వాగు వద్దకు తీసుకొచ్చారు. ఒక మిషన్‌ను నీటిలోకి దింపారు. మరో మిషన్ వాగు ఒడ్డున ఉంది. త్వరలోనే అధికారికంగా సిల్ట్ తొలగింపు పనులు ప్రారంభించనున్నట్లు తెలిసింది. సిల్ట్ తొలగించేందుకు 20 ఏండ్లు పడుతుందని అధికారుల అంచనా వేస్తున్నారు.
1.31 కోట్ల టన్నుల సిల్ట్ తొలగింపు లక్ష్యం..
లోయర్ మానేరు డ్యామ్‌లో సుమారు 1.31 కోట్ల టన్నుల సిల్ట్ ను తొలగించడమే లక్ష్యంగా కాంట్రాక్ట్ కంపెనీకి పనులు అప్పగించినట్లు తెలిసింది. మానేరు డ్యామ్ నీళ్లలో నుంచే బురద, వ్యర్థాలను తొలగించేందుకు హైడ్రో సైక్లోన్ పద్ధతిని అనుసరించబోతున్నారు. తొలగించే సిల్ట్ లో సుమారు 25 శాతం ఇసుక ఉంటుందని అంచనా. పూడికలో మట్టిని, ఇసుకను వేరు చేసి తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి సమీపంలోని ఎస్సారెస్పీ భూముల్లో డంప్ చేయనున్నారు. ఇసుకను టన్నుకు రూ.406.64 చొప్పున పనులు చేపట్టిన కాంట్రాక్టర్ ప్రభుత్వానికి అమ్మాలని అగ్రిమెంట్‌లో పేర్కొన్నట్లు తెలిసింది.
పూడికతీతతో ఎల్‌ఎండీలో నీటి నిల్వ పెరగనుందని ఇరిగేషన్ ఇంజినీర్లు చెప్తున్నారు. ఎల్‌ఎండీ పూర్తి స్థాయి నీటిమట్టం 24.034 టీఎంసీలుకాగా డ్యామ్ నిర్మించిన కొత్తలో డెడ్ స్టోరేజీ 2.6 టీఎంసీగా ఉండేది. కానీ సిల్ట్ పేరుకుపోయాక డెడ్ స్టోరేజీ 1.9 టీఎంసీలకే పరిమితమైంది. పూడికతీత తర్వాత డెడ్ స్టోరేజీ 3.9 టీఎంసీలకు పెరిగే అవకాశముందని ఇరిగేషన్ ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే మిగతా ప్రాజెక్టుల్లోనూ సిల్ట్ ను తొలగించే పనులు చేపట్టనున్నారు.