
- సింధు జలాల మళ్లింపుపై రైతుల నిరసన
- రాస్తారోకో చేస్తున్న రైతులపై పోలీసుల లాఠీ చార్జ్
- ఆగ్రహంతో పోలీసులపై తిరగబడ్డ రైతులు
సింధ్: సింధు జలాలను పంజాబ్‌కు మళ్లించే ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పాక్ ప్రజలు చేపట్టిన నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారింది. నిరసనలలో భాగంగా హైవేపై రాస్తారోకో చేసేందుకు రైతులు ప్రయత్నించగా పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాట, పోలీసుల లాఠీ దెబ్బలతో ఇద్దరు రైతులు చనిపోయారు. దీంతో నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులపైకి ఎదురుదాడికి దిగారు. ఈ ఘర్షణలో పలువురు పోలీసులు, నిరసనకారులు గాయపడ్డారు.
అయినప్పటికీ నిరసనకారులు వదలకుండా ఆసుపత్రిలోకి వెళ్లి మరీ పోలీసులపై దాడి చేశారు. అనంతరం లాఠీ చార్జి చేయాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారనే అనుమానంతో స్థానిక మంత్రి నివాసంపై దాడి చేశారు. ఇంట్లోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. ఆపై ఇంటికి నిప్పు పెట్టారు. ఈ నిరసనలకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోలలో సింధ్హోంమినిస్టర్ జియా ఉల్ హసన్ లాంజర్ నివాసం తగలబడిపోవడం కనిపిస్తోంది.
అసలేం జరిగిందంటే..
పాకిస్తాన్ లోని సింధ్ ప్రాంతంలో ప్రజలు ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుంటారు. సింధు నదీజలాలను తాగు, సాగు నీటికి ఉపయోగిస్తుంటారు. ఇటీవల వర్షాభావం వల్ల సింధ్ లో నీటి కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే పంజాబ్ప్రజల తాగునీటి అవసరాల కోసం సింధు జలాలను మళ్లించేందుకు పాక్ ప్రభుత్వం ఓ కెనాల్ నిర్మాణం చేపట్టింది. దీనిపై సింధ్ ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేసినా పట్టించుకోలేదు. ఓవైపు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) షరతులకు లోబడి పంటలకు మద్దతు ధర నిలిపివేయడం, మరోవైపు తమ పంట పొలాలను కార్పొరేట్ సేద్యం కోసం గుంజుకోవడం తదితర పరిణామాలతో ప్రభుత్వంపై రైతులు ఆగ్రహంగా ఉన్నారు.
దీనికి తోడు ఇప్పటికే నీటి ఎద్దడితో సతమతమవుతుంటే జీవాధారమైన సింధు జలాలను పంజాబ్‌కు మళ్లించే ప్రయత్నం చేయడం రైతుల ఆగ్రహాన్ని మరింత పెంచింది. ప్రభుత్వం చేపట్టిన కెనాల్ నిర్మాణం వల్ల మరింత నష్టం కలుగుతుందని, తమ పంట పొలాలు బీడువారిపోతాయని ఆందోళనతో రైతులు రోడ్డెక్కారు. సింధు జలాల మళ్లింపు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. రైతుల ఆందోళనలను అణచివేసేందుకు సింధ్ ప్రభుత్వం పోలీసులను ప్రయోగించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.