Sivakarthikeyan : నా కుటుంబంపై పెయిడ్ సైబర్ ఎటాక్స్‌.. 'పరాశక్తి' ఈవెంట్‌లో శివకార్తికేయన్ ఎమోషనల్!

 Sivakarthikeyan : నా కుటుంబంపై పెయిడ్ సైబర్ ఎటాక్స్‌.. 'పరాశక్తి' ఈవెంట్‌లో శివకార్తికేయన్ ఎమోషనల్!

కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ సంక్రాంతి పోరు కేవలం సినిమాల మధ్యే కాదు.. అభిమానుల మధ్య కూడా యుద్ధంలా మారుతోంది. శివకార్తికేయన్ నటించిన 'పరాశక్తి', దళపతి విజయ్ 'జననాయకన్' చిత్రాలు ఒక్క రోజు వ్యవధిలో విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో థియేటర్ల వద్ద వాతావరణం వేడెక్కింది. ఈ క్రమంలో 'పరాశక్తి' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో శివకార్తికేయన్ చేసిన ఎమోషనల్ స్పీచ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

కుటుంబంపై సైబర్ దాడి..

ఈవెంట్‌లో శివకార్తికేయన్ మాట్లాడుతూ.. తనపై, తన కుటుంబంపై జరుగుతున్న సోషల్ మీడియా దాడుల గురించి ఆవేదన వ్యక్తం చేశారు. నా కెరీర్‌లో ఎన్నో పెయిడ్ సైబర్ ఎటాక్స్‌ను చూశాను. కానీ ఈసారి హద్దులు దాటి నా కుటుంబాన్ని కూడా వివాదాల్లోకి లాగుతున్నారు. ఇది చాలా బాధాకరం అని ఎమోషనల్ అయ్యారు.  ఆ సమయంలో వేదిక కింద ఉన్న ఆయన భార్య ఆర్తి ముఖం చిన్నబోగా, తల్లి రాజీ దాస్ కన్నీళ్లు పెట్టుకోవడం అక్కడున్న వారిని కలచివేసింది. శివకార్తికేయన్ తన తల్లిని ఉద్దేశిస్తూ.. మా అమ్మ అడిగింది.. ఇలాంటి సమయంలో మనకు ఎవరున్నారు అని. కానీ ఇప్పుడు మా అమ్మకు చెబుతున్నాను.. నన్ను ప్రేమించే లక్షలాది మంది అభిమానులు నా వెనుక ఉన్నారు అని ధైర్యంగా చెప్పారు. దీంతో ఆయన తల్లి కన్నీళ్లు తుడుచుకుంటూ గర్వంగా నవ్వడం ఈవెంట్‌లో హైలైట్‌గా నిలిచింది.

విజయ్ ఫ్యాన్స్ హల్చల్..

అయితే ఈ ఈవెంట్‌లో ఊహించని పరిణామం ఎదురైంది. శివకార్తికేయన్ మాట్లాడుతుండగా గ్యాలరీలో ఉన్న విజయ్ అభిమానులు పెద్ద ఎత్తున 'TVK' (తమిళగ వెట్రి కళగం) అంటూ నినాదాలు చేశారు. విజయ్ రాజకీయ పార్టీ పేరును జపిస్తూ ఈవెంట్‌కు ఆటంకం కలిగించారు. 'పరాశక్తి' వర్సెస్ 'జననాయకన్' క్లాష్‌పై విజయ్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారన్నది ఈ ఘటనతో స్పష్టమైంది. దీనిపై శివకార్తికేయన్ క్లారిటీ ఇస్తూ.. విజయ్ సార్ అనుమతితోనే ఈ డేట్‌కు వస్తున్నామని చెప్పినా గొడవలు తగ్గలేదు.

 

 'జననాయకన్' వర్సెస్ 'పరాశక్తి'

సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన 'పరాశక్తి' మూవీ1960ల నాటి మద్రాస్ నేపథ్యంలో సాగుతుంది. హిందీ వ్యతిరేక ఉద్యమం చుట్టూ తిరిగే ఈ పొలిటికల్ డ్రామాలో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. జీవీ ప్రకాష్ సంగీతం అందించారు. ఈ మూవీ సంక్రాంతికి కానుకగా జనవరి 10 విడుదలకు సిద్ధమైంది. అటు  హెచ్. వినోద్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న ఆఖరి చిత్రం 'జననాయకన్'. ఇది బాలకృష్ణ నటించిన తెలుగు హిట్ 'భగవంత్ కేసరి'కి రీమేక్ అని ప్రచారం జరుగుతోంది. మామితా బైజూ, పూజా హెగ్డే, ప్రకాష్ రాజ్ , సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. సంక్రాంతి బరిలోకి దిగుతున్న ఈ రెండు చిత్రాలు కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తాయో చూడాలి.

►ALSO READ | Allu Arjun-Tiger Shroff: అల్లు అర్జున్-అట్లీ మూవీలో టైగర్ ష్రాఫ్? ఆ క్రేజీ వార్తల్లో నిజమెంత?