
- మృతుల్లో నలుగురు మహిళలు
భద్రాచలం, వెలుగు: ఆపరేషన్ మాన్సూన్లో భాగంగా శుక్రవారం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణ్‌పూర్ జిల్లా అబూజ్మాఢ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు. పరియా-కాకూర్ అటవీ ప్రాంతంలో జరిగిన కూంబింగ్ ఆపరేషన్‌లో నారాయణ్‌పూర్, కాంకేర్, బస్తర్, కొండగావ్ జిల్లాలకు చెందిన డీఆర్జీ, ఎస్టీఎఫ్, బీఎస్ఎఫ్ బలగాలు పాల్గొన్నట్లు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజు పి, కాంకేర్ రేంజ్ డీఐజీ అమిత్ తుకారం కాంబ్లే, నారాయణ్‌పూర్ ఎస్పీ రాబిన్సన్ గురియా తెలిపారు. ఎన్కౌంటర్లో నలుగురు మహిళలతో సహా ఆరురుగు పీఎల్జీఏ ప్లాటూన్ నంబర్–1 దళానికి చెందిన నక్సల్స్ చనిపోయినట్లు వెల్లడించారు.
మృతులపై రూ.48 లక్షల రివార్డు ఉందని తెలిపారు. పీఎల్జీఏ నంబర్ వన్ ప్లాటూన్ కమాండర్ రాహుల్ పూనెం(38), దళ సభ్యులు ఉంగీ తాతా(24), మనీషా(25), తాతీమీనా అలియాస్ సోమారీ అలియాస్ చోటీ(22), హరీశ్ అలియాస్ కోసా(25), కుడాం అలియాస్ బుద్రీ(21)గా గుర్తించారు. ఘటనా స్థలంలో ఏకె-47, ఎస్ఎల్ఆర్, 12 బోర్ తుపాకీ, 11 బీజీఎల్ లాంచర్లు, 83 బీజీఎల్ సెల్స్, భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. అబూజ్మాడ్ అటవీ ప్రాంతంలో, వర్షంలో గుట్టలు, వాగులు దాటి వెళ్లి కూంబింగ్ నిర్వహించిన భద్రతాబలగాలను ఐజీ అభినందించారు.