ఇండియన్ యానిమేషన్, డబ్బింగ్ ప్రపంచంలో సోనల్ కౌశల్ గురించి ఎంతోమందికి తెలుసు. డోరేమాన్, చోటా భీమ్, పికాచు, షిన్‌చాన్ లాంటి క్యారెక్టర్లకు వాయిస్ ఇచ్చి పిల్లల హృదయాలను ఆకట్టుకున్న ఆమె యూట్యూబ్‌లోనూ ఫేమస్ కంటెంట్ క్రియేటర్‌గా పేరు తెచ్చుకుంది. అందుకే డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కంటే తన చానెల్ పేరు ‘‘ది మోటార్ మౌత్” గా ఆమెను ఎక్కువమంది గుర్తుపడుతుంటారు.
సోనల్ కౌశల్ 1991 జూన్ 21న ఢిల్లీలో పుట్టింది. చిన్నప్పటినుంచి గొంతు మార్చి మాట్లాడడం, నటించడం అంటే ఆమెకు ఇష్టం. ఆ ఇష్టాన్ని గమనించిన వాళ్ల నాన్న ఆమెను డబ్బింగ్ ఆర్టిస్ట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. వాళ్ల అమ్మ ఆల్ ఇండియా రేడియోలో అనౌన్సర్‌గా పనిచేసేది.
ఆమె వల్ల సోనల్‌కు చిన్న వయసులోనే మైక్రోఫోన్‌తో పరిచయం ఏర్పడింది. 8 ఏళ్ల వయసు నుంచే చైల్డ్ ఆర్టిస్ట్‌గా రేడియో, దూరదర్శన్‌లో కార్యక్రమాలు చేసింది. అదే టైంలో డబ్బింగ్ ప్రపంచంలోకి కూడా అడుగుపెట్టింది. 2005లో డోరేమాన్ పాత్రకు డబ్బింగ్ చెప్పేందుకు ఆడిషన్ ఇచ్చి, సెలెక్ట్ అయ్యింది. అసలు డబ్బింగ్ అంటే ఏంటో పూర్తిగా తెలియని వయసులోనే వాయిస్ ఆర్టిస్ట్‌గా ప్రయాణం మొదలుపెట్టింది. అలా కొన్నేండ్ల పాటు ఆ పాత్రకు ప్రాణం పోసింది. కానీ.. తాను డోరేమాన్ పాత్రకు డబ్బింగ్ చెప్తున్న విషయం ఎప్పుడూ స్కూల్‌లో చెప్పలేదు. ఆ విషయాన్ని ఒకరోజు వాళ్ల నాన్న బయటపెట్టడంతో మరుసటి రోజు ప్రిన్సిపాల్ అసెంబ్లీలో ప్రకటించాడు. దాంతో అందరూ షాక్ అయ్యారు. స్కూల్‌లో ఆమె పెద్ద సెలబ్రిటీ అయిపోయింది. ఆ తర్వాత ఆమె గొంతు దేశవ్యాప్తంగా ఎంతోమంది పిల్లల హృదయాల్లో నిలిచిపోయింది.
యూట్యూబ్‌లోకి ఎంట్రీ...
డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టిన దాదాపు పదమూడు సంవత్సరాలకు ఆమె యూట్యూబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటికే ఆమె చాలా ఫేమస్ అయినప్పటికీ యూట్యూబ్‌లో ఎదగడానికి చాలా కష్టపడింది సోనల్. 2015 మార్చి 29న ‘ది మోటార్ మౌత్’ పేరుతో యూట్యూబ్ చానెల్ పెట్టింది. కానీ.. చానెల్‌లో తన మొదటి వీడియోను 2018 మార్చి 20న పోస్ట్ చేసింది. మొదట్లో పెద్దగా వ్యూస్ రాలేదు. అయినా.. రెగ్యులర్‌గా వీడియోలు చేసేది. అలా కొన్నాళ్లకు చానెల్‌కు మంచి పేరొచ్చింది. ప్రస్తుతం చానెల్‌ను 6.41 మిలియన్ల మంది సబ్‌స్క్రయిబ్ చేసుకున్నారు. ఈ చానెల్ ద్వారా ముఖ్యంగా డబ్బింగ్ ఆర్టిస్ట్‌లు ఎదుర్కొనే సమస్యల గురించి చెప్తుంటుంది. ఇందులో వివిధ పాత్రల వాయిస్ మాడ్యులేషన్, ఇతర వాయిస్ ఆర్టిస్టులతో ఇంటర్వ్యూలు, ఫన్ చాలెంజెస్, పాడ్‌కాస్ట్‌లు కూడా చేస్తోంది.
కొత్త తరానికి..
తన యూట్యూబ్ చానెల్ ద్వారా నిర్వహించే ‘ది మోటర్ మౌత్ షో’కు బెస్ట్ పాడ్‌కాస్ట్ అవార్డులు కూడా దక్కాయి. తన వెబ్‌సైట్, యూట్యూబ్ ద్వారా ‘వాయిస్ ఓవర్ కిక్‌స్టార్ట్ కోర్స్’ తీసుకొచ్చింది. దీనిద్వారా కొత్త తరం వాయిస్ ఆర్టిస్టులకు ట్రైనింగ్ ఇస్తోంది.
వాయిస్ ఆర్టిస్ట్‌గా..
డోరేమాన్ (మొదటి హిందీ వాయిస్), చోటా భీమ్, పికాచు (పోకీమాన్), షిన్‌చాన్, బబుల్స్ (పవర్‌పఫ్ గర్ల్స్), హార్లీ క్వీన్, వైలెట్ (ఇన్‌క్రెడిబుల్స్ 2), గ్యాబీ గ్యాబీ (టాయ్ స్టోరీ 4) వంటి 100కి పైగా పాత్రలకు డబ్బింగ్ చెప్పింది. ఇండియా వాయిస్ ఫెస్ట్‌లో రెండుసార్లు బెస్ట్ యానిమేషన్ వాయిస్ అవార్డు సాధించింది.
ఒరిజినల్ వాయిస్
అందరూ డోరేమాన్ పాత్రకు సోనాల్ గొంతు మార్చి డబ్బింగ్ చెప్పింది అనుకుంటారు. కానీ.. అది ఆమె చిన్నప్పటి ఒరిజినల్ వాయిస్. కాస్టింగ్ డైరెక్టర్లు అప్పట్లో డోరేమాన్ జపనీస్ వాయిస్‌ను పోలిన రోబోటిక్ వాయిస్ కోసం వెతికారు. అయితే అదే టైంలో సోనల్ వాయిస్ మార్చి ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయ్యింది. కానీ.. ఒక ఫుల్ ఎపిసోడ్ రికార్డ్ చేయాలని కూర్చున్నప్పుడు ఆ గొంతును మెయింటెయిన్ చేయలేకపోయింది. ఆమె ఒరిజినల్ వాయిస్ నచ్చి డైరెక్టర్స్ టీం మొత్తం ఎపిసోడ్‌ను తన వాయిస్‌తోనే చెప్పించింది. ఆ వెర్షన్ వాళ్లకు చాలా బాగా నచ్చింది. దాంతో అదే డోరేమాన్ వాయిస్‌గా మారింది.

