విద్యార్థులు, నిరుద్యోగుల కోసం త్వరలో డిక్లరేషన్

విద్యార్థులు, నిరుద్యోగుల కోసం త్వరలో డిక్లరేషన్
  • బాసర ట్రిపుల్ ఐటీలో సమస్యలను పరిష్కరించాలి: రేవంత్ రెడ్డి

ఇందల్వాయి, వెలుగు: రైతుల డిక్లరేషన్​మాదిరిగానే త్వరలో విద్యార్థులు, నిరుద్యోగ యువత కోసం కూడా డిక్లరేషన్​తీసుకొస్తామని పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చెప్పారు. 11 నెలల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నదని, అప్పుడు డిక్లరేషన్‌‌ను పూర్తిస్థాయిలో అమలు చేస్తామని, స్టూడెంట్లు, నిరుద్యోగుల భవిష్యత్‌‌కు బంగారు బాటలు వేస్తామని హామీ ఇచ్చారు. బాసర ట్రిపుల్​ఐటీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్​చేశారు. లేదంటే తాము ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వస్తామన్నారు. బాసర నుంచి హైదరబాద్ వెళ్తూ నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో శుక్రవారం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్​మధ్య యుగాలనాటి చక్రవర్తిలా ప్రవర్తిస్తున్నాడని, తనకు నచ్చినట్లే అందరూ బతకాలనుకుంటున్నాడని, కానీ ఆయన కేవలం ఐదేండ్ల కోసం ఎన్నుకున్న సీఎం అన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. టీఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో విద్యావ్యవస్థ భ్రష్టు పట్టిందని ఆరోపించారు.

‘‘స్కూళ్లలో టీచర్లు లేరు. కాలేజీల్లో లెక్చరర్లు లేరు. వర్సిటీల్లో ప్రొఫెసర్లు లేరు. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైనా పుస్తకాలు ప్రింట్​కాలేదు’’ అని విమర్శించారు. విద్యాలయాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. బీహర్ రాష్ట్ర సమితి కోసం కాకుండా విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రివ్యూ పెట్టాలని కేసీఆర్‌‌‌‌కు సూచించారు. అంతకుముందు బాసర ట్రిపుల్​ఐటీలో అరెస్ట్ సందర్భంగా రేవంత్​ మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కారు పోలీసుల నిర్బంధాలతో పరిపాలన సాగించాలనుకుంటున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో ఏర్పాటు చేసిన బాసర ట్రిపుల్ ఐటీని కాపాడుకునే బాధ్యతను తామే తీసుకుంటామన్నారు. తాము అధికారంలోకి రాగానే ట్రిపుల్ ఐటీలో అన్ని సమస్యలు పరిష్కరించి మెరుగైన విద్య అందిస్తామన్నారు.

అగ్నిపథ్ నిర్ణయం కరెక్ట్ కాదు
ఆర్మీ ఉద్యోగ అభ్యర్థుల మనోభావాలకు భిన్నంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఫలితమే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్​లో జరిగిన ఘటన అని పీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి అన్నారు. ఇలా జరగటం దురదృష్టకరమని ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు. దేశభక్తితో సైన్యంలో చేరడానికి సిద్ధంగా ఉన్న యువత ఇంతలా ఆందోళనకు దిగారంటే అగ్నిపథ్ సరైనది కాదని అర్థమవుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం పాత విధానాన్నే కొనసాగించాలని రేవంత్ సూచించారు.