
అనుకున్నది ఒక్కటి..అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే..ఢిల్లీ క్యాపిట్స్ టీమ్. ప్రమాదం కారణంగా పంత్ దూరమైనా..డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ రాకతో జట్టుకు కొండంత అండ దొరికింది..ఈ సారి టీమ్ కూడా బలంగా ఉంది. ఛాంపియన్ గా నిలుస్తుందనుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ చెత్త ఆటతో..లీగ్ దశలోనే ఐపీఎల్ 2023 నుంచి నిష్క్రమించింది. ఇప్పటి వరకు 12 మ్యాచులు ఆడిన ఢిల్లీ..4 మ్యాచుల్లో మాత్రమే గెలిచి..మరో 8 మ్యాచుల్లో ఓడిపోయి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది. ఈ తరుణంలో జట్టు ప్రక్షాళనపై ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం దృష్టి పెట్టింది. వచ్చే సీజన్ కోసం ఇప్పటి నుంచి కసరత్తు ప్రారంభించింది.
పాంటింగ్కు ఉద్వాసన ..?
మేటి ఆటగాడైన రిక్కీ పాంటింగ్ ను హెడ్ కోచ్ గా నియమించినా జట్టు ఫలితాల్లో మార్పులు రాలేదు. అదే ఆటతీరు..అదే పేలవ ప్రదర్శన. దీంతో హెడ్ కోచ్ గా ఉన్న పాంటింగ్ కు ఉద్వాసన పలికే అవకాశం ఉంది. అతన్ని కోచ్ పదవి నుంచి తప్పించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. పాంటింగ్ స్థానంలో టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి హెడ్ కోచ్ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సూత్ర ప్రాయంగా వెల్లడించాడు.
గంగూలీ కోచ్ అయితే..
ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ కు సరైన కోచ్ సౌరవ్ గంగూలీ అని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ సహాయక సిబ్బందిలో ఉన్న సౌరవ్ గంగూలీని పాంటింగ్ నుండి బాధ్యతలు స్వీకరించాలని సూచించాడు. ఢిల్లీ డగౌట్‌లో సౌరవ్ గంగూలీ ఉండటం చాలా పెద్ద విషయమని... దాదాకు కోచ్ బాధ్యత కూడా అప్పగిస్తే, అతను జట్టులో మార్పు తీసుకురాగలడని తాను భావిస్తున్నట్లు చెప్పాడు. గంగూలీకి భారత ఆటగాళ్ల సైకాలజీపై అవగాహన ఉందని... అతనికి ఎలా చేయాలో తెలుసన్నాడు. కాబట్టి క్యాపిటల్స్‌కు కోచ్‌గాగంగూలీయే సరైన వ్యక్తి అని పఠాన్ అభిప్రాయపడ్డాడు.