
- నాలుగు రోజులు అటు ఇటుగా ఎంటరవుతాయన్న ఐఎండీ
హైదరాబాద్, వెలుగు:నైరుతి రుతుపవనాలు ఈ సారి అతి త్వరగానే కేరళలోకి ప్రవేశించనున్నాయి. ఈ నెల 27న కేరళలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. శనివారం నైరుతి రుతుపవనాలపై ఫోర్కాస్ట్ను విడుదల చేసింది. నాలుగు రోజులు అటూఇటుగా రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలున్నట్టు తెలిపింది. మే 13న సౌత్ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవుల్లోకి ప్రవేశిస్తాయని తెలిపింది.
ఆ తర్వాత నాలుగైదు రోజుల్లో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమొరిన్, దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లోకి పూర్తిగా, మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని వివరించింది. కాగా, ఇప్పటికే పలు చోట్ల వేసవి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని ఐఎండీ పేర్కొంది. మామూలుగా అయితే కేరళలోకి నైరుతి రుతుపవనాలు జూన్ 1న ప్రవేశిస్తాయని, ఈ సారి మే 27 నాటికే వస్తాయని తెలిపింది.
ఆరు అంశాల ఆధారంగా..
ఆరు అంశాల ఆధారంగా నైరుతి రుతుపవనాల రాకను అంచనా వేసినట్టు ఐఎండీ తెలిపింది. ఆగ్నేయ భారతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు, దక్షిణ భారతంలో ప్రీ మాన్సూన్ వర్షాలు, ఆగ్నేయ పసిఫిక్ మహాసముద్రంలో సగటు సముద్ర పీడనం, దక్షిణ చైనా సముద్రంలో రేడియేషన్ తగ్గుదల, ఈశాన్య హిందూ మహాసముద్రంలో గాలులు, ఇండోనేసియా రీజియన్లోని గాలుల ప్రభావం ఆధారంగా నైరుతి రుతుపవనాల ప్రవేశాన్ని అంచనా వేసినట్టు తెలిపింది. గత ఐదేండ్లు అంచనాలకు అనుగుణంగా నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయని తెలిపింది. 2020లో జూన్ 5న ఎంటరవుతాయని అంచనా వేయగా.. అంతకన్నా నాలుగు రోజుల ముందుగానే జూన్ 1న ప్రవేశించాయని వెల్లడించింది. 2023లో జూన్ 4న వస్తాయని అంచనా వేస్తే జూన్ 8న, 2024లో మే 31న కేరళలోకి ఎంటరవుతాయని ఫోర్కాస్ట్ ఇస్తే మే 30న రుతుపవనాలు ప్రవేశించాయని ఐఎండీ వెల్లడించింది.