పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రతీ ఫిర్యాదును ఆన్​లైన్ ​చేస్తున్నాం .. వెలుగుతో కామారెడ్డి ఎస్పీ రాజేశ్​ చంద్ర

పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రతీ ఫిర్యాదును ఆన్​లైన్ ​చేస్తున్నాం .. వెలుగుతో  కామారెడ్డి ఎస్పీ రాజేశ్​ చంద్ర
  • మెరుగైన సేవలే లక్ష్యం
  • చోరీల నియంత్రణకు విలేజ్ ​సెక్యూరిటీ సిస్టమ్​
  • మిస్సింగ్​ కేసులపై లోతుగా విచారణ
  • పని చేసే వారికి ప్రోత్సాహం..  నిర్లక్ష్యం చేస్తే సస్పెన్షన్​

కామారెడ్డి, వెలుగు: ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యమని.. బాగా పని చేసే పోలీసులను ప్రోత్సహించి, రివార్డులు ఇస్తామని, డ్యూటీలో నిర్లక్ష్యం చేస్తే సస్పెండ్​చేస్తామని కామారెడ్డి ఎస్పీ రాజేశ్​చంద్ర అన్నారు. ఇటీవల కేసుల విచారణ, ప్రజలతో దురుసు ప్రవర్తన, విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు ఎస్సైలతోపాటు ముగ్గురు సిబ్బందిని సస్పెండ్​ చేసినట్లు తెలిపారు. చోరీల నియంత్రణకు విలేజ్​సెక్యూరిటీ సిస్టమ్​అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన 'వీ6 వెలుగు'తో  పలు అంశాలపై మాట్లాడారు.  

కేసుల ఎంక్వైరీకి ప్రశాంత వాతావరణం

అన్యాయం జరిగిందని ఠాణాకు వచ్చే బాధితులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని పోలీసులు కలిగించాలి.  కేసుల ఎంక్వైరీకి ఎస్ హెచ్ వోలకు ప్రశాంత వాతావరణం కల్పిస్తున్నాం. కొన్ని కేసుల విచారణకు ఇతర శాఖల సహకారం అవసరం ఉంటుంది. అటువంటి సమయంలో సంబంధిత అధికారులతో మాట్లాడి, సమాచారం ఎస్​హెచ్ వోలకు అందేలా ఏర్పాట్లు చేస్తున్నాం. డ్యూటీలో చురుగ్గా వ్యవహరించడం, విచారణ వేగంగా పూర్తి చేసి, నిందితులను అరెస్టు చేస్తున్న అధికారులు, సిబ్బందిని  సన్మానిస్తున్నాం. రివార్డులు అందించి, వాటిని సర్వీసు బుక్​లో ఎన్​రోల్ అయ్యేలా చూస్తున్నాం.    

మిస్సింగ్​ కేసుల ఫైల్స్​రీ ఓపెన్​

రామారెడ్డి స్టేషన్​పరిధిలో మిస్సింగ్​ కేసును ఎంక్వైరీ చేయించడంతో ఏడాది కిందట మర్డర్ అయినట్లు తేలింది. నిర్లక్ష్యం చేసిన ఎస్​హెచ్​వోపై చర్యలు తీసుకున్నాం.  మిస్సింగ్ కేసుల ఫైల్స్​ను రీ ఓపెన్ చేయిస్తున్నాం. పోలీస్​ స్టేషన్ల పరిధిలో మిస్సింగ్ ఫిర్యాదులు ఎన్ని పెండింగ్​లో ఉన్నాయి?  వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని ఎస్​హెచ్​వోలను ఆదేశించాం.  

ఫిర్యాదుదారులకు మేసేజ్​లు

ఠాణాకు వచ్చే ప్రతీ ఫిర్యాదును ఆన్​లైన్​ చేయిస్తున్నాం. ఫిర్యాదుదారులకు 3 దశల్లో మెసేజ్​లు వెళ్తాయి. కంప్లైంట్​ఆన్​లైన్​ అయిన వెంటనే ఒకటి,  ఫిర్యాదుపై ఎవరు ఎంక్వైరీ చేస్తున్నారో వారి పేరుతో ఒకటి,  విచారణ పూర్తయ్యాక మరో మెసేజ్​పంపిస్తున్నాం. పిటిషన్​నిజమైతే ఎఫ్ఐఆర్​ నమోదు చేసి, చర్యలు తీసుకుంటున్నాం. బాధితులు ముందు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేయాలి.  అక్కడ తగిన చర్యలు తీసుకోకుంటే మాకు కంప్లైంట్​చేయాలి. జిల్లా కేంద్రం వరకు స్వయంగా రావాల్సిన అవసరం లేదు. సమస్యను పేపర్​ మీద రాసి, పోస్టులో పంపినా వెరిఫై చేస్తాం. వివరాల సేకరణ కోసం ఫోన్ నంబర్​కూడా రాయాలి. 

యువకులతో టీం.. రాత్రివేళల్లో గస్తీ

హైవేపై దోపిడీలు, ఇండ్లలో చోరీలకు పాల్పడిన పలువురిని అరెస్టు చేశాం. దొంగతనాల నియంత్రణకు ప్రజల సహకారం రావాలి. గ్రామాల్లోని యువకులతో టీం ఏర్పాటు చేసి, రాత్రివేళల్లో రోజుకు కొందరు చొప్పున గస్తీ తిరిగేలా చూస్తున్నాం. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. హైవే–44పై కామారెడ్డి నుంచి హైదరాబాద్​ వెళ్లే మార్గంలో స్పీడ్​కంట్రోల్ యూనిట్​ఏర్పాటు చేశాం. స్పీడ్​లిమిట్​80 చేశాం. హైదరాబాద్​నుంచి కామారెడ్డికి వచ్చే మార్గంలోనూ త్వరలో ఏర్పాటు చేస్తాం. మిగతా రోడ్లపై బ్లాక్​ స్పాట్​లను గుర్తిస్తున్నాం. మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వొద్దు.  

ట్రాఫిక్​ సమస్యపై ప్రత్యేక దృష్టి

జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ట్రాఫిక్​ పోలీస్ స్టేషన్ మంజూరు కావాల్సి ఉంది.​  ఈలోగా ట్రాఫిక్​ పోలీస్ స్టేషన్లు ఉన్న ఏరియాల నుంచి అధికారులను రప్పించి, ఏం చేయాలన్నదానిపై చర్చిస్తాం. కొన్నిచోట్ల వెహికిల్స్ పార్కింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయించేందుకు ప్రయత్నిస్తున్నాం.