కథా రచయిత కారా మాస్టారు కన్నుమూత

కథా రచయిత కారా మాస్టారు కన్నుమూత

హైదరాబాద్, వెలుగు: ప్రముఖ కథా రచయిత, కారా మాస్టారుగా పేరుపొందిన కాళీపట్నం రామారావు శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారంతో ఉన్న ఆయన శ్రీకాకుళంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం మురపాకలో 1924లో పుట్టిన కారా మాస్టారు పూర్తి పేరు కాళీపట్నం వెంకట సూర్య రామ సుబ్రహ్మణ్యేశ్వర రావు. ఆయన 1964 లో రాసిన 'యజ్ఞం' కథ ఫ్యూడల్ విధానంలో దోపిడీని కళ్లకు కట్టింది. యజ్ఞంతో పాటు 9 కథల సంపుటికి ఆయన 1996లో కేంద్ర సాహిత్య అవార్డు అందుకున్నారు. రాష్ట్ర సాంస్కృతిక మండలి హంస అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌‌‌‌ అందుకున్నారు.
సీఎం కేసీఆర్ సంతాపం
కారా మాస్టారు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. సామాన్యుల జీవితాల్లోని వ్యక్తిగత, సామాజిక కోణాలను తన కథల ద్వారా విభిన్నంగా కళ్లకు కట్టిన గొప్ప రచయిత కారా అని సీఎం గుర్తు చేశారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కారా మాస్టారు మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర అభ్యుదయ రచయితల సంఘం సంతాపం తెలిపింది. కథా సాహిత్యమే ఊపిరిగా ఆయన రచనలు చేశారని, గొప్ప అభ్యుదయ సాహితీవేత్తను కోల్పోయామని సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్వీ రామారావు, రాపోలు సుదర్శన్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 
లక్షలాది కథలకు కేరాఫ్ కథా నిలయం 
ఉపాధ్యాయుడిగా రిటైర్‌‌ అవ్వగా వచ్చిన డబ్బుతో పాటు.. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కింద వచ్చిన రివార్డును కలిపి కారా మాస్టారు శ్రీకాకుళంలో రెండంతస్తులతో కథా నిలయాన్ని ప్రారంభించారు. వీక్లీ, మంత్లీ మ్యాగైజైన్లతోపాటు, న్యూస్ పేపర్లలో వచ్చిన ప్రతి కథ.. కథా నిలయానికి చేరాల్సిందే. మొదట 800 తెలుగు కథల పుస్తకాలతో ప్రారంభమైన ఈ కథా నిలయంలో ఇప్పుడు లక్షలాది కథలు ఉన్నాయి.